Wayanad Landslides Toll Rises To 308 : కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కు చేరింది. ఇంకా సుమారు 300మంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. మరోవైపు 40 బృందాలు నాలుగో రోజు సహాయక చర్యలు ప్రారంభించాయి. నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
40 బృందాలతో సెర్చ్ ఆపరేషన్స్
శుక్రవారం ఉదయం దాదాపు 40 బృందాలు మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేసింది. దీనితో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జ్ మీదుగా ఎక్స్‌కవేటర్‌లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్‌లను కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని తెలిపారు. చలియార్ నది తీర ప్రాంతాల్లో మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించనున్నారు. మృతదేహాల కోసం స్థానిక ఈతగాళ్లు నది ఒడ్డున వెతకనున్నారు. అదే సమయంలో పోలీసులు హెలికాప్టర్‌తో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తారు.
అంతేకాకుండా మట్టిదిబ్బల్లో ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు దిల్లీ నుంచి డ్రోన్ ఆధారిత రాడార్‌ను శనివారం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి కె రాజన్ తెలిపారు. ప్రస్తుతం ఆరు పోలీసు శునకాలు సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్నాయని, మరో నాలుగింటిని తమిళనాడు నుంచి వయనాడుకు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 279 శవపరీక్షలు పూర్తి చేసినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. ఈ ఘటనలో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Mundakkai, Chooralmala in Wayanad.
— ANI (@ANI) August 2, 2024
Death toll stands at 308, as per Kerala Health Minister pic.twitter.com/G8thUNhWcC
#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Mundakkai, Chooralmala in Wayanad.
— ANI (@ANI) August 2, 2024
The current death toll stands at 308, as per Kerala Health Minister Veena George pic.twitter.com/AFt4jmnCkz
VIDEO | Kerala: Braving rains and adverse terrain, 40 teams of rescuers began search operations in landslide-hit Wayanad district on the fourth day on Friday.#WayanadDisaster #WayanadLanslide #WayanadTragedy
— Press Trust of India (@PTI_News) August 2, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/TseP1piGvo
నలుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్
శుక్రవారం చేపట్టిన సహాయక చర్యల్లో నలుగురు సభ్యులున్న ఓ కుటుంబాన్ని రక్షించారు రెస్క్యూ సిబ్బంది. పాతవెట్టికున్నిల్లో ఓ ఇంట్లో కుటుంబం ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వెళ్లి వారిని రక్షించి హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతాలను తరలించారు. కుటుంబ సభ్యుల గురించి బంధువులు సమాచారం ఇవ్వడం వల్లే సిబ్బంది అక్కడకు వెళ్లి గాలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడినప్పుడు వారి ఇంటిపై ఎలాంటి ప్రభావం పడకపోవడం వల్లే వాళ్లు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
బైడెన్ సంతాపం
వయనాడ్ ప్రమాద మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. జిల్ బైడెన్‌తోపాటు తాను మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు తమ అండ ఉంటుందని అన్నారు.
హెచ్చరికలు చేశాం
ఇదిలా ఉండగా కేరళ భారీ వర్షాలకు సంబంధించి సాధారణ హెచ్చరికలను ముందుగానే జారీ చేశామని భారత వాతావరణశాఖ (ఐఎండీ) చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జులై 30వ తేదీ ఉదయమే రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశామని పేర్కొన్నారు. అయితే అదే రోజు తెల్లవారుజామునే కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రమాదంపై కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఐఎండీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేరళకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌నే జారీ చేసిందని ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు.
వయనాడ్ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్ - Satellite Images Of Wayanad