Wayanad Landslides Indian Army : కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వీరి పని నిబద్దతను చూసి వయనాడ్‌కు చెందిన ఓ మూడో తరగతి విద్యార్థి, ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖకు ఆర్మీ కూడా స్పందిచింది. దీనితో ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'ప్రియమైన ఇండియన్ ఆర్మీ, నా జన్మస్థలం వయనాడ్‌లో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూశాను. ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు. బాధితులను కాపాడడానికి వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కూడా ఏదో ఒక రోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను' అని ఆ బాలుడు రాసుకొచ్చాడు.
స్పందించిన ఆర్మీ
బాలుని లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణ వల్ల, దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొంటూ, బాలుడి లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణతో మేము మరింత ఉత్సాహంగా పని చేస్తాం. నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి, మాతో కలిసి నిలబడే రోజు కోసం ఎదురు చూస్తుంటాం. అప్పుడు దేశ ప్రజల కోసం కలిసి పోరాడదాం. నీ ధైర్యానికి, స్ఫూర్తికి ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్ వైరల్ అవుతుండడం వల్ల సైనికులు చేస్తున్న సేవలకు నెటిజన్లు తలవంచి నమస్కరిస్తున్నారు. చిన్నారికి వచ్చిన ఆలోచనను ప్రశంసిస్తున్నారు.
#WayanadLandslide
— Southern Command INDIAN ARMY (@IaSouthern) August 3, 2024
Dear Master Rayan,
Your heartfelt words have deeply touched us. In times of adversity, we aim to be a beacon of hope, and your letter reaffirms this mission. Heroes like you inspire us to give our utmost. We eagerly await the day you don the uniform and stand… pic.twitter.com/zvBkCz14ai
కొనసాగుతున్న సహాయక చర్యలు
మరోవైపు కొండచరియలు విరిగిపడిన మండక్కై, చూరల్‌మలా ప్రాంతాల్లో ఆరో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300లకు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. మట్టి, శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వయనాడ్ విలయంలో ఇప్పటి వరకు 308 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు వెలికి తీసినట్టు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులున్నట్టు తెలిపింది.
'వయనాడ్' బాధితులకు మోహన్‌లాల్ రూ.3 కోట్లు విరాళం - Actor Mohanlal In Wayanad