Waqf Bill Parliament Winter Session 2024 : ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు-2024 చర్చకు రానుంది. లోక్‌సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి మోదించనున్నారు. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్-అమెండ్‌మెంట్ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను గత ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు, నివేదికకు తుది మెరుగులు దిద్దనుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ). అందులో భాగంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ గురువారం భేటీ కానుంది. వక్ఫ్ బిల్లుపై నివేదికను ఫైనల్ చేయనుంది.