Waqf Act Amendment Bill : వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ని పంపుతామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
భగ్గుమన్న విపక్షాలు
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కిరణ్ రిజిజు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టినా అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుందని ఆరోపించింది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, ఎంఐఎం, ఎస్‌పీ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు నేతలు భగ్గుమన్నారు. మైనారిటీలు వారి సంస్థలను నిర్వహించడాన్ని వివరించే ఆర్టికల్ 30కి ఇది ప్రత్యక్ష ఉల్లంఘన అని డీఎమ్‌కే ఎంపీ కనిమొళి అన్నారు. ఓ వర్గాన్ని ఈ బిల్లు లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండదు
అయితే, విపక్షాల ఆరోపణలను కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. 'సచార్ కమిటీ నివేదిక మేరకు వక్ఫ్ బిల్లును రూపొందించాం. దీనిపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపాం. దీని వల్ల మతపరమైన స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇప్పటి వరకు హక్కులు పొందని వారికి ఈ చట్టంతో ప్రయోజనం చేకూరుతుంది. వక్ఫ్ బోర్డులను మాఫియా ఆక్రమించిందని చాలా మంది ఎంపీలు అంటున్నారు. కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మద్దతు ఇవ్వలేమని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో వివిధ మతాల సభ్యులుండాలని మేము చెప్పట్లేదు. పార్లమెంట్ సభ్యుడు మాత్రం బోర్డులో ఉండాలంటున్నాం' అని కేంద్రమంత్రి రిజిజు వివరించారు. అయితే, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు రిజిజు వెల్లడించారు.
వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరగనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ సర్కారు ఎప్పట్నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది.