Vice Chancellors Letter On Rahul Gandhi : యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు, మాజీ వీసీలు, విద్యావేత్తలు కలిపి మొత్తం 181 మంది బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ వర్సిటీల్లో వీసీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. వీసీలను కేవలం ప్రతిభ ఆధారంగా కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
'పొలిటికల్ మైలేజ్ కోసమే అసత్య ఆరోపణలు'
వీసీలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతిభ, విద్య, పరిపాలనా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని లేఖలో విద్యావేత్తలు పేర్కొన్నారు. వీసీల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. విశ్వవిద్యాలయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా మైలేజ్ పొందాలనే ఉద్దేశంతో యూనివర్సిటీల్లో వీసీల నియామకాలపై అసత్య ఆరోపణలు చేశారు. ఆయనపై వెంటనే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల నిర్వహకులుగా నైతికత, సంస్థాగత సమగ్రతను కాపాడుకోవడంలో మంచి నిబద్ధతను కలిగి ఉన్నాం. కల్పిత కథలు, నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం మానుకోవాలి. దేశంలోని యూనివర్సిటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్, ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలలో ముందున్నాయి. యూనివర్సిటీల అభివృద్ధిలో వీసీల కృషి కూడా ఉంది." అని బహిరంగ లేఖలో విద్యావేత్తలు పేర్కొన్నారు.
'వీసీలుగా ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తులు'
ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నవారిని యూనివర్సిటీల్లో వీసీలుగా కేంద్రం నియమిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వీసీలు, విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై జేఎన్యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్, దిల్లీ యూనివర్సిటీ వీసీ యోగేశ్ సింగ్, ఏఐసీటీఈ ఛైర్మన్ టీజీ సీతారాం, బీఆర్ అంబేడ్కర్ నేషనల్ లా యూనివర్సిటీ వీసీ సహా పలువురు విద్యావేత్తలు సంతకం చేశారు.