Uttarakhand Trekking Tragedy : వాళ్లిద్దరి పుట్టిన రోజు ఒకటే. చదివిన కాలేజీ ఒకటే. ఆ తర్వాత పెళ్లిచేసుకుని ఒక్కటయ్యారు. కానీ సరదాగా వెళ్లిన ట్రెక్కింగ్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. దురదృష్టవశాత్తు దంపతులు ఇద్దరూ ఒకే రోజు మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఉత్తరాఖండ్‌లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన వీరిద్దరూ మృతిచెందారు. వీరితో సహా ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు.
కర్ణాటక హుబ్బళికి చెందిన వినాయక్ ముంగురవాడీ, సుజాత ముంగరవాడీ భార్యాభర్తలు. వీరిద్దరూ సంవత్సరాలు వేరైనా ఒకేరోజు అక్టోబర్ 3న జన్మించారు. ఆ తర్వాత 1994లో హుబ్బళిలోని బీవీబీ కాలేజీలో ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని హుబ్బళి నుంచి 1996లో బెంగళూరుకు మకాం మార్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వినాయక్, ఉత్తర కర్ణాటక స్నేహలోక అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి గత 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలోనూ అనేక మందికి సాయం చేశారు. ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉన్న వినాయక్ ప్రతి ఏడాది వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భార్యతో కలిసి ఉత్తరాఖండ్ సహస్త్రతాల్ సరస్సు వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఇద్దరూ మరణించారు.
ఇదీ జరిగింది
ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాల్లో 4 వేల 400 మీటర్ల ఎత్తున సహస్త్రతాల్ సరస్సు ఉంది. మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందాన్ని హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ సరస్సు వద్దకు పంపింది. వారిలో 18మంది ట్రెక్కర్లు కర్ణాటకకు చెందిన వారు కాగా, ముగ్గురు స్థానిక గైడ్లు వారిని తీసుకుని వెళ్లారు. అయితే జూన్ 7న తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా వారు దారి తప్పారు. వారు బేస్ క్యాంప్‌నకు చేరుకోకపోవడం వల్ల ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఇందులో 9 మంది ట్రెక్కర్లు చనిపోయినట్లు గుర్తించింది. మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు తేల్చింది. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వడం వల్ల హెలికాఫ్టర్ సాయంతో SDRF వారిని కాపాడారు.
'50 ప్లస్' మహిళల సాహసయాత్ర.. హిమాలయాల్లో కాలినడకన.. వేల కి.మీ. ట్రెక్కింగ్..
హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9మంది మృతి- ఇంకా అనేక మంది అక్కడే! - Uttarakhand Trek Accident