Prayers For Kamala Harris : డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం వల్ల ఆ స్థానాన్ని దక్కించుకునేదెవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. దీంతో కమల తల్లి శ్యామల గోపాలన్ స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె బంధువులు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈటీవీ భారత్తో మాట్లాడారు.
"2019లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికైనప్పుడు పండుగలా జరుపుకొన్నాం. ఈ ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించడం ఖాయం. అగ్రరాజ్య అధ్యక్షురాలైన తర్వాత ఆమె భారతదేశ అభివృద్ధికి పాటుపడలాన్నదే మా కోరిక" అని కమలా హారిస్ బంధువు ఆనంద్ తెలిపారు. "అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పేరును ప్రతిపాదించడం సంతోషంగా ఉంది. ఆమె తప్పకుండా గెలుస్తుంది. కమల విజయం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎన్నికల్లో గెలిచి భారత్‌కు రావాలి. మన దేశ అభివృద్ధికి తోడ్పడాలి" అని మరో బంధువు రూపదర్శిని అన్నారు.
కొన్నేళ్ల క్రితం ఆ ఆలయానికి విరాళం
అయితే కమలా హారిస్ కుటుంబం ఇప్పటికీ తమ మూలాలు ఉన్న తులసేంద్రపురం గ్రామంతో సన్నిహితంగా ఉంటోంది. ఆమె తల్లి శ్యామల సోదరి చెన్నైలో ఉంటున్నారు. కొంతమంది బంధువులు తులసేంద్రపురంలో నివసిస్తున్నారు. అలాగే ఆమె పూర్వీకుల గుడి అయిన ధర్మశాస్త దేవాలయం తులసేంద్రపురంలో ఉంది. కమలా హారిస్ కొన్నేళ్ల క్రితం ఆ ఆలయానికి భూరి విరాళం ఇచ్చారు. ఆలయ శాసనంలో ఆ వివరాలు కూడా నమోదు కావడం గమనార్హం.
అయితే కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. 59 ఏళ్ల కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమోదం లభిస్తే అమెరికా చరిత్రలోనే కీలక నిర్ణయం కానుంది. ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలవనున్న తొలి ఆసియా సంతతి మహిళగా చరిత్రకెక్కనుంది.