UPSC 2023 Topper Aditya Srivastava : యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించడమంటే ఆషామాషీ కాదు. కఠోర శ్రమతోనే అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలు సాధించగలరు. ఇటీవలే విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ టాపర్‌గా నిలిచారు. మరి ఆదిత్య జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, సివిల్స్ ప్రిపరేషన్ గురించి ఆయన తల్లిదండ్రులు ఏం చెప్పిన విషయాలు మీకోసం.
'పాపా, ఇది చాలా ఎక్కువ'- సివిల్స్ ఫలితాలు రాగానే ఉద్వేగానికి లోనై ఆదిత్య తన తండ్రికి ఫోన్ అన్న మాటలివి. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ఇంట్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు ఆనంద బాష్పాలు వదులుతూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఆదిత్య తన తండ్రి అజయ్ శ్రీవాస్తవకు ఫోన్ చేసిన ముందు, ఆయన యూపీఎస్సీ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేశారు. అప్పటికీ రిజల్ట్స్ రాలేదు. దీంతో ఆయన కొంత ఆందోళనకు గురయ్యారట. ఆ తర్వాత ఆదిత్య వాట్సాప్ కాల్ చేసి తనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చిందని చెప్పారట.
రాత్రింబవళ్లు శ్రమించి!
యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ విజయగాథ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. అంతకుముందు ఒకసారి ఐపీఎస్‌కు ఎంపికైన ఆదిత్య అక్కడితో సంతృప్తి పడలేదు. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. ఆదిత్యకు ఒక సోదరి ఉన్నారు. ఆమె కూడా కూడా దిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆదిత్యలాగే అయన సోదరి సైతం ఐఏఎస్ కావాలని కలలు కంటున్నారు. కాగా, ఆదిత్య తండ్రి అజయ్ శ్రీవాస్తవ కేంద్ర ఆడిట్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి అభా శ్రీవాస్తవ గృహిణి.
"మా అబ్బాయి ఐఏఎస్ కావాలని కోరుకున్నాం. సివిల్స్ ర్యాంకుల్లో ఆదిత్య మొదటి ఐదు స్థానాల్లో ఉంటాడని భావించాం. కానీ ఫలితాల్లో ఆదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించడం చూసి మేము నమ్మలేకపోయాం. ఆదిత్య చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. 10, 12వ తరగతుల్లో మంచి ర్యాంకులు సాధించాడు. ఆ తర్వాత ఐఐటీకి ఎంపికయ్యాడు. ఐఐటీ కాన్పుర్‌లో చదువు పూర్తైన తర్వాత ఏడాదిన్నర ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు."
--అభా శ్రీవాస్తవ, ఆదిత్య శ్రీవాస్తవ తల్లి
'డైనోసార్లంటే ఇష్టం'
అంతకుముందు తన కుమారుడు ఆదిత్యకు యూపీఎస్సీలో 236 ర్యాంక్ వచ్చి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడని ఆదిత్య తండ్రి అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అయినా అప్పుడు ఆదిత్య సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్నానని, ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆదిత్య అన్నారని చెప్పారు.
"నా కొడుకు చిన్నప్పటి నుంచి మంచి కమిట్మెంట్తో ఉండేవాడు. అందుకే మేం సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా ప్రోత్సహించాం. ఆదిత్య మేనమామ ఐఏఎస్ అధికారి. ఆయన నుంచి ఆదిత్య ప్రేరణ పొందాడు. చదువుతో పాటు క్రికెట్ ఆడటం, చూడటం, పాటలు వినడం ఆదిత్యకు ఇష్టం. ఈ హాబీలతో పాటు డైనోసార్ల గురించి సమాచారాన్ని సేకరించడం, పరిశోధించడం ఆదిత్యకు ఇష్టం."
--అజయ్ శ్రీవాస్తవ, ఆదిత్య శ్రీవాస్తవ తండ్రి
ఇటీవలే విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా, అనిమేష్ ప్రధాన్ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్ (4), రుహాని (5), సృష్టి దబాస్ (6), అన్‌మోల్ రాఠోర్ (7), ఆశిష్ కుమార్ (8), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు.
నానమ్మకు సివిల్స్ ర్యాంక్ బహుమానం - మాజీ కానిస్టేబుల్ విజయం