ETV Bharat / bharat

మెయిన్‌పురిలో త్రిముఖ పోరు- 'డింపుల్' యాదవ్ ముమ్మర ప్రచారం- లండన్​ నుంచి కూతురు వచ్చి మరీ! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 8:52 AM IST

Updated : May 2, 2024, 9:43 AM IST

UP Mainpuri Lok Sabha Polls 2024
UP Mainpuri Lok Sabha Polls 2024

UP Mainpuri Lok Sabha Polls 2024 : సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది. గత ఎన్నికల్లో సునాయసంగా విజయ పతాక ఎగరేసిన సమాజ్‌వాదీ పార్టీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది. ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ ఈసారి గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నుంచి ఆమె తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. మెయిన్‌పురి నియోజకవర్గంలో తల్లిని గెలిపించేందుకు డింపుల్‌ యాదవ్‌ కుమార్తె అదితీ యాదవ్‌ కూడా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేస్తున్నారు.

UP Mainpuri Lok Sabha Polls 2024 : దేశంలోనే అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర్​ప్రదేశ్‌లోని 80 నియోజకవర్గాల్లో మెయిన్‌పురి ఒకటి. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో మే ఏడో తేదీన మెయిన్‌పురిలో పోలింగ్‌ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో వచ్చిన ప్రతి మార్పునకు మెయిన్‌పురి నియోజకవర్గం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిలయమైన ఈ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ హవా మొదలైంది. 27 ఏళ్లుగా మెయిన్‌పురి ములాయంసింగ్‌ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్ 1996, 2004, 2009, 2014, 2019లో ఐదుసార్లు మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

ములాయం రాజీనామా చేయడం వల్ల!
Dimple Yadav Lok Sabha Polls : 2014లో మెయిన్‌పురి, అజంగఢ్ రెండు స్థానాల నుంచి ములాయం సింగ్‌ యాదవ్‌ గెలిచారు. ఆ తర్వాత అజంగఢ్‌ నుంచే ప్రాతినిధ్యం వహించాలని ములాయం భావించారు. మెయిన్‌పురి స్థానానికి ములాయం రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో ములాయంసింగ్‌ యాదవ్‌ మనవడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్‌ మెయిన్‌పురికు ప్రాతినిధ్యం వహించారు. 2014లో మెయిన్‌పురికి జరిగిన ఉపఎన్నికల్లో తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఆరున్నర లక్షలకుపైగా ఓట్లను దక్కించుకున్నారు.

ములాయం సింగ్ యాదవ్ మరణంతో!
పోలైన ఓట్లలో 64.46 శాతం ఓట్లు తేజ్‌ప్రతాప్‌ సింగ్‌కు దక్కాయి. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉపఎన్నికలో ములాయం కోడలు అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్ యాదవ్ 6.18 లక్షల ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 64.08 శాతం ఓట్లు డింపుల్‌కు లభించాయి. ఆ ఎన్నికల్లో 2.88 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్‌సింగ్‌పై డింపుల్‌ యాదవ్‌ గెలుపొందారు.

డింపుల్ యాదవ్‌కు గట్టి సవాల్
మెయిన్‌పురి పార్లమెంట్‌ నియోజకవర్గంలో అయిదు శాసనసభ స్థానాలు ఉన్నాయి. అవి మెయిన్‌పురి, భోంగావ్, కిష్ని, కర్హల్, జస్వంత్‌నగర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ ప్రాభవం తగ్గడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 5 నియోజకవర్గాల్లో రెండో చోట్ల భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలిచాయి. డింపుల్ యాదవ్‌కు బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ గట్టి సవాల్‌ విసురుతున్నారు.

ముమ్మర ప్రచారం
బీజేపీ అభ్యర్ధి జైవీర్‌ సింగ్‌ ప్రస్తుతం యోగీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మెయిన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మెయిన్‌పురిలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. శాంతిభద్రతలు, మహిళల భద్రత, ఎలక్టోరల్ బాండ్ల జారీ, నిరుద్యోగం వంటి అంశాలతో డింపుల్‌ యాదవ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కమలం పార్టీ గెలవాలని యూపీలో యోగీ, కేంద్రంలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ ప్రచారం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ సమాజ్‌వాదీ పార్టీ వైఖరిని బీజేపీ అభ్యర్థి ప్రస్తావిస్తున్నారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

ఎవరు పోటీ చేసినా గెలుపు నాదే: డింపుల్
మెయిన్‌పురి నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం తమదేనని డింపుల్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆమె అన్నారు. ప్రచారంలో ప్రజల మద్దతు, ప్రేమ, ఆశీస్సులు లభిస్తున్నాయని గత మెజార్టీ రికార్డులను బద్దలుకొట్టి గెలుస్తామని డింపుల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు : బీజేపీ
ములాయం సింగ్ యాదవ్ మరణం నుంచి వచ్చిన సానుభూతి కారణంగా 2022 ఉప ఎన్నికల్లో డింపుల్‌ యాదవ్‌ గెలిచారని, కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేవని జైవీర్‌ సింగ్‌ తెలిపారు. గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దానికి డింపుల్‌ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. తమ జీవితాన్ని, జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మెయిన్‌పురి ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు.

లండన్​ నుంచి డింపుల్ కుమార్తె వచ్చి!
ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌ కుమార్తె అదితి యాదవ్‌ కూడా తల్లి తరఫున ప్రచారం చేస్తున్నారు. లండన్‌లో చదువుకొని సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన అదితిని చూసేందుకు ఓటర్లు. ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో అదితి తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీలో తన ప్రసంగంతో అదితి ఆకట్టుకున్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని అదితి విమర్శించారు. గ్యాస్, పెట్రోల్ సహా అన్నింటి ధరలు పెరుగుతున్నాయని ప్రజలను హెచ్చరిస్తూ అదితి ప్రసంగాలు దంచేస్తున్నారు.

45 శాతం మంది యాదవులే!
ములాయం సింగ్‌ యాదవ్‌ను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు. మెయిన్‌పురిలో అఖిలేశ్‌ సామాజిక వర్గమైన యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. ఇక్కడి ఓటర్లలో 45 శాతం మంది యాదవులే. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయంసింగ్‌ ప్రభావం కారణంగా సమాజ్‌వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో సత్తా చాటుతోంది. మే 7న ఈ స్థానానికి ఓటింగ్‌ జరగనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :May 2, 2024, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.