Pooja Khedkar IAS Controversy : మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). దీంతో పాటు భవిష్యత్తులో UPSCకి సంబంధించిన పరీక్షలూ రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. పూజా ఖేడ్కర్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్(CSE) 2022 నియమాలను ఉల్లంఘించినట్టు తేలిందని వివరించింది. ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు UPSC ఓ ప్రకటనలో తెలిపింది.
తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై జులై 18న పూజా ఖేడ్కర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది UPSC. జులై 25లోగా దీనిపై సమాధానం చెప్పాలని పూజను ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమె, ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పూజ విజ్ఞప్తిని పరిశీలించిన UPSC, 30 జులై మధ్యాహ్నం 3.30 గంటల వరకు అనుమతించింది. అయితే, ఆమెకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సమయంలోగా సరైన స్పందన రాకపోవడం వల్ల తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే పూజా ఖేడ్కర్ వ్యవహారంపై UPSC ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పుణెలో శిక్షణలో ఉండగా పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపై UPSC దర్యాప్తు చేసింది. పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించారు.
సర్టిఫికెట్లపైనా అనుమానాలే!
2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె నాన్ క్రీమీలేయర్, వైద్య ధ్రువీకరణలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును చేపట్టింది.