Jamili Election Bill In Lok Sabha : లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కానీ ఈ జమిలి బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయి చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.
VIDEO | Union Law Minister Arjun Ram Meghwal (@arjunrammeghwal) moves 'one nation, one election' bills for introduction in Lok Sabha.#OneNationOneElectionBill
— Press Trust of India (@PTI_News) December 17, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/vgPvelEwLu
ఓటింగ్
జమిలి బిల్లును లోక్‌సభ పరిగణనలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీనితో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లు అయ్యింది.
#WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha.
— ANI (@ANI) December 17, 2024
(Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO
వ్యతిరేకించిన విపక్షాలు
ఓటింగ్‌కు ముందు జమిలి బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. "129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం" అని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌కు విరుద్ధంగా బిల్లులను ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు.
"రాజ్యాంగ సవరణ బిల్లు దేశ ఎన్నికల ప్రక్రియనే సమూలంగా మార్చివేస్తుందని, దీనిపై చర్చ జరగాలని" ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ప్రేమచంద్ర పట్టుబట్టారు.
రాజ్యాంగ విధ్వంసం
"ఏకకాల ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారు" అని సమాజ్‌వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
"జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే" అని టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించారు. కేవలం ఒక వ్యక్తి (మోదీ) కలను నెరవేర్చేందుకే బిల్లు పెట్టారని బెనర్జీ ఆరోపించారు. జమిలి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు చెప్పారు.
టీడీపీ బేషరతు మద్దతు
ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లుకు మద్దతు తెలపగా, విపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శివసేన ఉద్దవ్ వర్గం బిల్లును వ్యతిరేకించగా, శిందే వర్గం సభ్యులు మద్దతు తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, ఎంఐఎం, సీపీఎం సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఎన్సీపీ ఎస్పీ సభ్యురాలు సుప్రియా శూలే బిల్లును వ్యతిరేకించారు. టీఆర్ బాలు కోరినట్లు బిల్లును జేపీసీకి పంపించి చర్చకు ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలి బిల్లు విరుద్ధం కాదని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు.