Union Cabinet Decisions Today : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు జీతంలో 50 శాతం పెన్షన్ రానుంది. మిగిలిన వారికి వారివారి సర్వీసును బట్టి పెన్షన్ రానుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో (ఎన్‌పీఎస్) చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తిస్తుంది. 2004 ఏప్రిల్ 1 అనంతరం సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్‌పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి జమచేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అంతకు ముందు చందాతో సంబంధం లేకుండా జీతంలో 50శాతం వరకూ పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ యూపీఎస్ విధానాని ఆమోదించింది. ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
VIDEO | " one of the biggest decisions (taken by union cabinet today) is about bioe3. like there was industrial revolution and it revolution, a bio revolution will soon take place. fields related to bio-technology and bio-science will help in generating a lot of job opportunities.… pic.twitter.com/3AjOFbtOBZ
— Press Trust of India (@PTI_News) August 24, 2024
రాష్ట్రాలు సైతం చేరే అవకాశం
ఎన్‌పీఎస్ చందాదారులంతా యూపీఎస్‌లోకి మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2025 ఏప్రిల్ 1 నుంచి) యూపీఎస్ అమల్లోకి రానుంది. తద్వారా సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్‌తో ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలూ ఇందులో చేరాలని భావిస్తే 90 లక్షల మందికి లాభం కలుగుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇదీ యూపీఎస్
- 50%, పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతన (బేసిక్) సగటులో సగం పెన్షన్‌గా అందుతుంది.
- 25 ఏళ్లు, సగం పెన్షన్‌గా అందుకోవాలంటే ఉండాల్సిన కనీస సర్వీసు.
- 60%, పెన్షన్‌దారు మరణించాక వారి భాగస్వామికి పెన్షన్‌లో అందే శాతం.
- రూ.10,000, ఉద్యోగికి అందించే కనీస పెన్షన్.
- 10 ఏళ్లు పెన్షన్‌కు అర్హత సాధించాలంటే కావాల్సిన కనీస సర్వీసు.
ద్రవ్యోల్బణ సూచీ లెక్క ఇదీ
గ్యారంటీ పెన్షన్, గ్యారంటీ కుటుంబ పెన్షన్, గ్యారంటీ కనీస పెన్షన్‌కు కరవు పరిహారాన్ని (డియర్‌నెస్ రిలీఫ్- డీఆర్) పారిశ్రామిక కార్మికులకు వర్తింపజేసే అఖిల భారత వినియోగ ధరల సూచీ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా నిర్ణయిస్తారు.
10వ వంతు
గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ చేసిన రోజున ఏక మొత్తం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నెల వేతన మొత్తంలో (వేతనం + డీఏ) 10వ వంతును లెక్కగట్టి చెల్లింపులు చేస్తారు. ఇందుకోసం ప్రతి 6 నెలల సర్వీసును ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎటువంటి సంబంధం లేదు. దీనివల్ల పెన్షన్ తగ్గదు.
కొత్తగా భారం పడదు
ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్‌ను ఎంచుకుంటే అదనపు భారం పడదు. ప్రస్తుతమున్న 10శాతం చందానే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18శాతానికి పెరుగుతుంది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలను చెల్లించడానికి రూ.800 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. తన వాటా పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ.6,250 కోట్లను భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరితే అదనపు భారాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.
సోమనాథన్ సిఫార్సులతో
భాగస్వామ్య పెన్షన్ విధానంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో గత ఏడాది కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమితులైన టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఆర్థికశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్‌పీఎస్‌లో చేయాల్సిన మార్పులపై సమీక్ష జరిపి సిఫార్సులు చేయాల్సిందిగా సూచించింది. మరోవైపు బీజేపీ యేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో భాగస్వామ్య పెన్షన్ విధానాన్ని ఎత్తేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యయనం జరిపిన సోమనాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది.
యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్) 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఇది ఇప్పటికే పదవీ విరమణ చేసిన, 2025 మార్చి 31వ తేదీ నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు.
బయో ఈ3
బయో టెక్నాలజీ రంగంలో అభివృద్ధి దిశగా పయనించేందుకు వీలుగా తీసుకొచ్చిన బయో ఈ3 (ఆర్థిక, పర్యావరణ, ఉద్యోగ కల్పన కోసం బయో టెక్నాలజీ) విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బయో టెక్నాలజీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధికి ఈ విధానం దోహదపడనుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
విజ్ఞాన ధార
సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటుగా పరిశోధన, ఆవిష్కరణ, టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న 3 పథకాలను కలిపి విజ్ఞాన ధార పేరుతో తీసుకొస్తున్న కొత్త పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు, పరిశ్రమలు, స్టార్టప్‌లకు సంబంధించిన అన్ని స్థాయిల ఆవిష్కరణలను ప్రోత్సహించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం (2021-22.. 2025-26) కాలంలో విజ్ఞాన ధారకు రూ.10,579 కోట్లను కేటాయించనున్నామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
11 బిల్లులను వెనక్కి పంపిన గవర్నర్- సర్కార్‌తో మరింత పెరిగిన దూరం! - Governor Vs State Govt