Union Budget 2024 Modi : 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన తాత్కాలిక బడ్జెట్ బడ్జెట్ ఓ గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించిందని చెప్పారు. పేద, మధ్యతరగతి వర్గాలకు తాత్కాలిక బడ్జెట్ సాధికారత, యువతకు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
"సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇది. దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించింది. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీ ఇచ్చింది. ఇది యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబం. సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటుచేశాం. అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం గురించి ప్రకటించాం. మహిళలను లక్షాధికారుల్ని చేసే 'Lakhpati Didis' పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ఉద్దేశం" అని మోదీ తెలిపారు.
భారత్ రోడ్‌మ్యాప్!
భారత్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా మార్చేందుకు గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన మైలురాళ్లను బడ్జెట్ ప్రసంగం వెలుగులోకి తెచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. 2024 మధ్యంతర బడ్జెట్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. "ఇది ప్రోత్సాహకరమైన బడ్జెట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధిస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన తెలిపారు. "భారత్‌ను ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా తాత్కాలిక బడ్జెట్ ఉంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్‌గా వర్ణించారు బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్.
'రూ.18 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఆందోళనకరం'
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్లగా ఉందని కాంగ్రెస్ మండిపడింది. ఇందులో రూ.18 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఖర్చుల కోసం భారీగా అప్పులు చేస్తున్నారని, ఈ సంఖ్య వచ్చే ఏడాదికి మరింత పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆరోపించారు. ఈ బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్డీయే ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చుకునే ఒకే ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉందని తివారీ ధ్వజమెత్తారు.
- 'పద్దులో పస లేదు!'
మంచిమంచి పదాలతో అలంకరించి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారన్నారు మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. పద్దులో మాత్రం పస లేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు అత్యంత తక్కువ సమయం సాగిన బడ్జెట్ ప్రసంగం ఇదేనన్నారు. విదేశీ పెట్టుబడులు తగ్గాయన్న విషయాన్ని అంగీకరించకుండా ఆ విషయం గురించి మాట్లాడారని తెలిపారు. విశ్వాసం, ఆశలు వంటి అస్పష్టమైన భాషలో ఆమె వ్యాఖ్యానించారని, అయితే కానీ వాస్తవ గణాంకాల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు.