TTD Invites Applications for Sculpture Courses : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే పది, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. దాంతో విద్యార్థులంతా భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచించే పనిలో పడతారు. అలాగే భవిష్యత్తులో ఏ కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
పదో తరగతి పాసై, శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి.. ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది టీటీడీ(TTD). ఇంతకీ, ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తోంది. శిల్పకళపై ఆసక్తి ఉన్నవారు ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ డిప్లొమా కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు. సర్టిఫికెట్ కోర్సు వ్యవధి 2 సంవత్సరాలు. ఈ కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఆ రోజు వరకు అప్లికేషన్స్ స్వీకరణ :
శిల్పకళపై ఆసక్తి గల విద్యార్థులు ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల అందిస్తోన్న డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన టీటీడీ.. మే 1 నుంచి అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. జూన్ 17 వరకు కళాశాలలో అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
అర్హత గల విద్యార్థులు జూన్ 17వ తేదీ సాయంత్రం లోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ కోర్సులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే కళాశాల ఆఫీసు నంబర్లను (0877-2264637, 9866997290) సంప్రదించవచ్చని సూచించింది.