Tree Man Of Chandigarh : హరియాణా, చండీగఢ్ సహా ఉత్తర భారతదేశంలో ఎండలు భగభగమంటున్నాయి. హరియాణాలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. ఎండలు, వేసవితాపానికి తట్టుకోలేక జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం గత 10 ఏళ్లుగా పాటుపడుతున్న ఓ వ్యక్తిని హరియాణా, చండీగఢ్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బ్యాంకులో రూ.లక్షల్లో లోన్ తీసుకుని మరి 2లక్షలకు పైగా మొక్కలు పెంచిన ఆ వ్యక్తిని స్మరించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో? ఆయనేం చేశారో చూద్దాం.
'ట్రీ మ్యాన్' గా సుపరిచితుడు
హరియాణాలోని సోనిపట్ జిల్లాకు చెందిన దేవేంద్ర సురా చండీగఢ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014 నుంచి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన జీతం మొత్తాన్ని మొక్కలు పెంపకం కోసం ఖర్చు చేస్తున్నారు. అందుకే ఆయనను హరియాణా ప్రజలు ముద్దుగా 'ట్రీ మ్యాన్' అని పిలుచుకుంటారు. దేవేంద్ర సురా తన సొంత జిల్లా సోనిపట్‌లో నర్సరీని ఏర్పాటు చేశారు. దానికి జనతా నర్సరీ అని పేరు పెట్టారు.
"నేను సాధారణ జీవితాన్ని గడుపుతాను. ప్రకృతిని బాగా ప్రేమిస్తాను. ప్రతి ఏడాది వేలాది చెట్లను నాటుతున్నాను. గత పదేళ్లలో వివిధ ప్రాంతాల్లో 2.25 లక్షలకుపైగా మొక్కలను నాటారు. ఇప్పటి వరకు పలు బ్యాంకుల్లో ప్లాంటేషన్ కోసం రూ.35 లక్షల రుణం తీసుకున్నాను. చెట్ల పెంపకానికి మాత్రమే నా జీతాన్ని ఖర్చు చేస్తాను. ఇంటి ఖర్చులను నా తండ్రి(రిటైర్డ్ జవాన్) చూసుకుంటారు. మొక్కల పెంపకంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. అయితే చండీగఢ్ డీజీపీ, ఎస్ ఎస్ పీ సహా ఐఏఎస్, ఐపీఎస్‌లు నాకు మద్ధతుగా నిలిచారు. నా వద్ద రెండు సైకిళ్లు ఉన్నాయి. వాటి పైనే కొన్ని ప్రయాణాలు చేస్తా. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే రైలు లేదా బస్సులో వెళ్తాను"
--దేవేంద్ర సురా, పోలీసు కానిస్టేబుల్
'యువకుల సహకారంతో'
తనకు ఖాళీ సమయం దొరికినప్పుడు సోనిపట్, రోహ్తక్, మహేంద్రగఢ్, కర్నాల్ సహా హరియాణాలోని పలు జిల్లాల్లో పర్యటిస్తానని మహేంద్ర తెలిపారు. అక్కడ ప్రకృతిని ప్రేమించే యువకుల సహకారంతో ప్రతిచోటా చెట్ల పెంపకం గురించి ప్రచారం చేస్తానని చెప్పారు. పంచాయతీ భూమి, ఇతర ప్రభుత్వ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం పలు జిల్లాల నుంచి యువత తనను మొక్కలు నాటేందుకు పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సత్కారం
పర్యావరణం, ప్రకృతి పరిరక్షణలో దేవేంద్ర సురా చేసిన కృషికి 2023లో ఐఐటీ దిల్లీలో కానిస్టేబుల్ దేవేంద్ర సురాను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సత్కరించారు. ప్రస్తుతం దేవేంద్ర చండీగఢ్ పోలీస్ విభాగంలో వీఐపీ సెక్యూటిరీగా పనిచేస్తున్నారు.