Smart Tracking Bag For Students : విద్యార్థుల కోసం స్మార్ట్ ట్రాకింగ్ బ్యాగ్‌ను తయారుచేశాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్కు చెందిన విద్యార్థి అన్షిత్. ఈ బ్యాగ్ పిల్లల లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాకపోయినా, తప్పిపోయినా తల్లిదండ్రులకు అలర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, హోమ్‌వర్క్ గురించి విద్యార్థులకు గుర్తుచేస్తుంది.
సాధారణంగా ఉండే బ్యాగ్‌లకు మాదిరిగానే ఈ స్మార్ట్ ట్రాకింగ్ బ్యాగ్‌లను తయారు చేశాడు అన్షిత్. పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు తప్పిపోకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ బ్యాగ్ చక్కగా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ద్వారా తల్లిదండ్రల మొబైల్ఫోన్స్కు ఈ బ్యాగ్ కనెక్ట్ అవడం వల్ల, పిల్లలు స్కూల్‌కు కాకుండా ఎక్కడికైనా వెళ్లినా, తప్పిపోయినా తెలిసిపోతుంది. ఈ బ్యాగ్ విద్యార్థల రక్షణకు మాత్రమే కాకుండా వారు చేయాల్సిన హోమ్వర్క్గురించి రిమైండర్స్ ఇస్తుందని అన్షిత్ తెలిపాడు.
"పిల్లల భద్రత దృష్ట్యా స్మార్ట్ ట్రాకర్ బ్యాగ్‌ను తయారుచేశాను. దీని ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీని ధర దాదాపు రూ.4 వేలు ఉంటుంది. ఇది సాధారణ బ్యాగ్‌లతో పోలిస్తే రూ. 1000-రూ.1500 వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ స్మార్ట్ ట్రాకింగ్ బ్యాగ్ తయారీలో జీపీఎస్ మాడ్యూల్, జీఎస్ఎం మాడ్యూల్, 3.7 వోల్ట్ బ్యాటరీ, సిమ్ కార్డ్‌ను ఉపయోగించాను. ఈ బ్యాగ్‌తో విద్యార్థుల లైవ్ లొకేషన్ వాళ్ల తల్లిదండ్రులకు తెలుస్తుంది. విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా వేరే చోటికి వెళ్లినా తెలిసిపోతుంది."
-అన్షిత్, బీటెక్ విద్యార్థి
చిన్న చిన్న ఆలోచనలతోనే విద్యార్థులు స్టార్టప్‌ను ప్రారంభించవచ్చని గోరఖ్‌పుర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్‌కే సింగ్, మీడియా ఇంఛార్జ్ డాక్టర్ మనోజ్ మిశ్రా తెలిపారు. యువత వ్యాపార ఆలోచనలు ప్రజలకు ఉపాధిని కూడా కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను స్టార్టప్‌లు స్థాపించేందుకు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. తద్వారా వారు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి స్వావలంబన పొందుతారని వెల్లడించారు. మరోవైపు, స్మార్ట్బ్యాగ్ను రూపొందించిన అన్షిత్ను గోర్ఖ్పుర్ కళాశాల యజమాన్యం అభినందించింది.