TMC Loksabha Candidates List 2024 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మాజీ ఎంపీ మహువా మొయిత్రా సహా 42 మంది పేర్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బహ్‌రమ్‌పుర్ నుంచి యూసుఫ్ పఠాన్, మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్ నుంచి తలపడనున్నారు. అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా, దుర్గాపుర్ నుంచి కీర్తి ఆజాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి బరిలోకి దిగనున్నారు.
16మంది సిట్టింగ్‌లకు మరోసారి ఛాన్స్
ఈ జాబితాలో 12మంది మహిళలకు అవకాశం ఇవ్వగా, 16మంది సిటింగ్‌లకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక స్థానం నుంచి పోటీకిగానూ సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సీఎం మమత చెప్పారు. అసోం, మేఘాలయాలోనూ పోటీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. "నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను. కానీ, కొంతమంది బీజేపీ ఏజెంట్లుగా పనిచేశారు" అని ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయపై విరుచుకుపడ్డారు.
బంగాల్‌లో దీదీ ఒంటరి పోరే
మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీ, కాంగ్రెస్‌కు కేవలం రెండు స్థానాలు ఇచ్చేందుకు ప్రతిపాదించగా ఆ పార్టీ తిరస్కరించింది. దీంతో బంగాల్‌లో భారతీయ జనతా పార్టీని ఒంటరిగా ఎదుర్కొనున్నట్లు ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, 42 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, నామినేషన్లు ఉపసంహరణ వరకు కూటమికి తలుపు తెరిచే ఉంటాయని తెలిపారు. ఏ ఒప్పందమైన చర్చల ద్వారానే కావాలని, ఒంటరి ప్రకటనల వల్ల కాదన్నారు ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. ఇండియా కూటమితోనే బీజేపీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు.
'యూసుఫ్‌పై గౌరవం ఉంటే రాజ్యసభకు పంపించాల్సింది'
మరోవైపు తన సిట్టింగ్ స్థానం ముర్షీదాబాద్‌కు టీఎంసీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రకటించడం పట్ల స్పందించారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ. "ఒకవేళ టీఎంసీ, యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలనుకుంటే బయటి వ్యక్తులకు బదులు రాజ్యసభకు పంపించాల్సింది. ఆయనపైన మంచి ఉద్దేశం ఉంటే గుజరాత్లో ఒక స్థానం ఇవ్వమని ఇండియా కూటమిని అడగాల్సింది. ఓట్లను చీల్చి బీజేపీకి సాయం చేసేలా అభ్యర్థిని ఎంపిక చేసింది టీఎంసీ" అని అధీర్ రంజన్ చౌధరీ ఆరోపించారు.
'బంగాల్‌లో టీఎంసీ లూటీ- కేంద్ర నిధులు దోచుకోవడానికి 25లక్షల ఫేక్ జాబ్ కార్డ్స్!'
'బంగాల్లోని ప్రతి ప్రాంతానికీ సందేశ్‌ఖాలీ తుపాను'- టీఎంసీపై మోదీ ఫైర్