TTD Darshan For Senior Citizens : ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుపతి-తిరుమల దేవస్థానం ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాక అనేక దేశాల నుంచి భక్తులు ఏడుకొండల మీద వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయం గోవింద నామాలతో మార్మోగుతూనే ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయానికి సంబంధించిన ప్రతి సమాచారాన్నీ ముందుగానే తెలియజేస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారంపై స్పందించింది.
వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు TTD విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నామని పేర్కొంది. తిరుమలలోని నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించింది. భక్తులు సరైన సమాచారానికి TTD అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
అన్న ప్రసాదంపై..
కొన్ని రోజుల క్రితం స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాల విషయంలో మార్పులు జరిగాయని, ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుందంటూ.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్నప్రసాదం కోసం సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించిన బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని ఒక వార్త వైరల్‌గా మారింది. అదేవిధంగా.. అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో.. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది. ఇవి పూర్తిగా ఫేక్‌న్యూస్ అని టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ధరలు తగ్గించారంటూ..
అంతకుముందు తిరుమల లడ్డూ ధరతోపాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర తగ్గించారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని, అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రూ.200లకు తగ్గించారంటూ ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడు కూడా స్పందించిన టీటీడీ... సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రూ. 50 లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని క్లారిటీ ఇచ్చింది.