Youtube Question Paper Leak In Odisha : యూట్యూబ్ ఛానల్లో ఎక్కువమంది ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 1-8వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలు లీక్ చేశాడు. తన భార్య పేరు మీద ఛానల్ ఓపెన్ చేసి ప్రశ్నలను అందులో అప్లోడ్ చేసేవాడు. స్కూల్ నుంచి ప్రశ్నాపత్రం అందిన వెంటనే తన భార్యకు ఇచ్చి పరీక్షకు ముందు యూట్యూబ్‌లో చర్చించేవారు. ఇలా యూట్యూబ్‌లో ప్రశ్నాపత్రాలు వైరల్ కావటం వల్ల చివరికి పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒడిశాలో భువనేశ్వర్‌లో జరిగింది.
అసలేం జరిగిదంటే!
మార్చి18న భువనేశ్వర్ సైబర్ పోలీస్ స్టేషన్‌కు పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం యూట్యూబ్‌లో వైరల్ అవుతుందని ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంజాం జిల్లాలోని రంభం అనే ప్రాంతానికి చెందిన సమీర్ సాహు ఈ పని చేసినట్లు తేల్చారు. అది కూడా తన యూట్యూబ్ ఛానల్ 'సమీర్ ఎడ్యుకేషనల్'లో ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసినట్లు తెలియడం వల్ల సమీర్ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. మార్చి 30న అతని దగ్గర ఉన్న ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమీర్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో సమీర్ తన ఛానల్‌తో పాటు ప్రో ఆన్సర్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేశారని చెప్పాడు. జాజ్పుర్లోని ఓ బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జగన్నాథ్ కర్, అతని భార్య రూతుపూర్ణ పతి ఈ పని చేసినట్లు సమీర్ తెలిపాడు. రూతుపూర్ణ భార్య పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసేవారని సమీర్ పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. లీకైన పేపర్లతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉపాధ్యాయుడు ఈ పనిని చేసినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షకు రెండు రోజుల ముందే పాఠశాలలో ప్రశ్నాపత్రాలను తీసుకుని వాటిని స్కాన్ చేసి పరీక్షకు ముందు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి, వాటిని చర్చించేవారని పోలీసులు పేర్కొన్నారు.
![Youtube Question Paper Leak In Odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-04-2024/21166780_paper-leak.jpg)
సేవకుడి మృతదేహం వద్ద ఆవు కన్నీరు- శ్మశానానికి వెళ్లి కూడా! - Cow At Owner Funeral