Tajinder Singh Bittu Joins BJP : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ప్రియాంకా గాంధీకి సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత తాజిందర్ సింగ్ పార్టీ పదవులతోపాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. అనంతరం దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో తాజీందర్‌సింగ్ బీజేపీలో చేరారు. మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ కోసం పనిచేశానన్న తాజీందర్ తాను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదన్నారు. కేవలం పంజాబ్ అభివృద్ధి కోసమే కమలం పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏఐసీసీ కో-ఇన్‌చార్జ్ సెక్రటరీ పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తాజిందర్ సింగ్ తెలిపారు.
'ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ తప్పుకుంది'
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజిందర్ సింగ్ కీలక పదవికి గుడ్ బై చెప్పడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని వారాలుగా కాంగ్రెస్ నుంచి అగ్ర నాయకులు పార్టీని వీడి కమలం గూటికి చేరుతున్నారు. "నేను దాదాపు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం నుంచి తప్పుకుంది. నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. పంజాబ్ అభివృద్ధి కోసం నేను బీజేపీలో చేరాను" అని తాజిందర్ సింగ్ తెలిపారు.
'60ఏళ్లలో కాంగ్రెస్ కంటే- పదేళ్లలో మోదీ చేసిందే ఎక్కువ'
తాజిందర్ సింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో చేసిన అభివృద్ధే ఎక్కువని అన్నారు. "మోదీ ప్రతి రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి కొత్త నమూనాను ప్రదర్శిస్తున్నారు. రైల్వే, కమ్యూనికేషన్, హైవేలు, టెక్స్‌టైల్స్ వంటి రంగాలను విస్తరిస్తున్నారు. మోదీ పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి." అని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు.
-
Tajinder Singh Bittu, AICC Secretary In-Charge Himachal Pradesh & close aide of Priyanka Gandhi resigns from primary membership of Congress Party pic.twitter.com/59HK4wnrOY
— ANI (@ANI) April 20, 2024
ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో కూరుకుపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ 6 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరారు. అయితే, ఎలాగో సుఖ్ ప్రభుత్వం బయటపడింది.