Swati Maliwal Case : ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో దిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దాడి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు విచారణ కోసం ముంబయి తీసుకెళ్లారు. సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేశారని స్వాతి మాలీవాల్ ఆరోపించిన వేళ, అది నిజమో కాదో తేల్చుకునేందుకు దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఆయనను ముంబయి తీసుకుని వెళ్లింది.
విచారణ నిమిత్తం బిభవ్ కుమార్‌ను ముంబయికి తీసుకెళ్లేందుకు దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో పోలీసులు అనుమతి తీసుకున్నారు. తనపై దాడి తర్వాత బిభవ్ తన ఫోన్‌ను పూర్తిగా ఫార్మాట్ చేశారని స్వాతి మాలీవాల్ ఇటీవల ఆరోపించారు. దీంతో పోలీసులు బిభవ్‌ను ముంబయి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేయనున్నారు. బిభవ్ కుమార్ తన ఫోన్‌లోని కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేశారో లేదో, ఫోన్ ఫార్మాట్ జరిగిందా లేదా అనేది తేల్చేందుకు సీన్ రీక్రియేషన్ చాలా ముఖ్యమైనని పోలీసులు తెలిపారు.
బీజేపీ విమర్శలు తీవ్రం
స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకోకుండా స్వాతి మాలీవాల్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. మరో ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇటీవల స్వాతి మాలీవాల్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు అంగీకరించారని, అయినా బిభవ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రశ్నించారు. ఒక మహిళా ఎంపీతో అసభ్యంగా ప్రవర్తించారని, దాని గురించి మాట్లాడకుండా ఆప్ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని సుధాన్షు మండిపడ్డారు. స్వాతి మాలీవాల్ వెనుక బీజేపీ ఉందన్న కేజ్రీవాల్ ఆరోపణలు సుధాన్షు తీవ్రంగా ఖండించారు.
అప్పుడూ అలాగే!
స్వాతీ మాలీవాల్‌పై దాడి జరిగిన వెంటనే బిభవ్ కుమార్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేశారని, ఈ కేసులో సాక్ష్యాలన్నింటీనీ ధ్వంసం చేస్తున్నారని మరో బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మీ ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ సమయంలో కూడా ఫోన్‌లు ధ్వంసం చేశారని, ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు దిల్లీ మంత్రులు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారిపై కోర్టుకు వెళ్తానని స్వాతీ మాలీవాల్ తెలిపారు.