Swati Maliwal Assaulted : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిగా బిభవ్ కుమార్ పేరును పేర్కొన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన తర్వాత స్వాతికి, ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. అంతకుముందు ఇద్దరు సభ్యుల దిల్లీ పోలీసు బృందం మాలీవాల్‌తో సమావేశమై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె స్వగృహంలో జరిగిన ఈ భేటీ సుమారు నాలుగు గంటలకు పైగా జరిగింది. దాడి ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు అదనపు పోలీసు కమిషనర్ పి.ఎస్.కుష్వాహా నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం 1.50 గంటలకు స్వాతి మాలీవాల్ ఇంటికి వెళ్లిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
బిభవ్‌కు NCW సమన్లు
మరోవైపు స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో బిభవ్ కుమార్‌కు గురువారం జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం సమన్లు పంపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.
పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన స్వాతి
పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ గురువారం వెల్లడించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు. "నా విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. వారు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నవారు నేను మరో పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వారిని ఆ దేవుడే కాపాడాలి" అని ఎక్స్‌లో మాలీవాల్ రాసుకొచ్చారు.
'కేజ్రీవాల్ చర్యలు తీసుకుంటారు'
మాలీవాల్‌పై దాడి జరిగిందన్న ఘటనపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ తగిన చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ "కేజ్రీవాల్‌కు ఈ విషయం తెలుసు. ఆయన తగిన పరిష్కారం కనుగొంటారు" అని ప్రియాంక చెప్పారు.
సీఎం నివాసంలో దారుణం!- ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ PA దాడి!! - Swati Maliwal Assaulted
'మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు'.. దిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు