Swati maliwal Assault Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయనను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో స్వాతి మలివాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
స్వాతి మాలీవాల్ వైద్య నివేదిక
మే 16వ తేదీ రాత్రి స్వాతి మాలీవాల్‌ను పరిశీలించిన తర్వాత వైద్య బృందం నివేదికను పోలీసులకు సమర్పించింది. వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్‌కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఎడమకాలుపై 3x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని, కుడి కన్ను కింద 2x2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది. దాదాపు 3 గంటల వైద్యపరీక్షల అనంతరం ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. తనపై దాడి జరిగిందన్న స్వాతి మలివాల్ ఆరోపణలకు ఈ వైద్య నివేదిక బలం చేకూర్చే విధంగా ఉంది.
అసలేం జరిగిందంటే!
దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం మే 13న సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసానికి స్వాతి మాలీవాల్ వెళ్లారు. ఆ సమయంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని క్రూరంగా భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మాలీవాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్వాతి, 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. ముందు చెంపపై కొట్టి, తర్వాత కాలితో తన్నాడని స్వాతి ఆరోపించారు. కర్ర తీసుకుని విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడని, కడుపులో కాలితో తన్నాడని స్వాతి వివరించారు. సున్నితమైన శరీర భాగాలపై కూడా పలుమార్లు కొట్టాడని చెప్పారు. చివరకు ఎలాగోలా బిభవ్ నుంచి తప్పించుకుని బయటికొచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చానని స్వాతి మాలీవాల్ వివరించారు. తన విషయంలో జరిగింది నిజంగా చాలా బాధాకరమని, అయితే దీన్ని రాజకీయం చేయదల్చుకోలేదని స్వాతి మాలీవాల్ పోస్ట్ చేశారు. మాలీవాల్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 354, 506, 509, 323 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.
సీన్ రీ కన్‌స్ట్రక్షన్
స్వాతి మాలీవాల్ ఫిర్యాదుతో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. మే 17న స్వాతిని సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు తీసుకెళ్లారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి సీసీటీవీ పుటేజీని సేకరించారు. స్వాతి మాలీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు బిభవ్ కుమార్ విచారణ హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ శనివారం ఉదయం నోటీసులు జారీ చేసింది. మరోవైపు కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతీ మలీవాల్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. బయటకు తీసుకువెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు.
ఆప్ ఎదురుదాడి
బిభవ్ కుమార్ కూడా స్వాతి మాలీవాల్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఇదంతా కుట్ర అని ఆరోపించారు. స్వాతి మాలీవాల్ బీజేపీకు తొత్తుగా మారారని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా మే 13న కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మాలీవాల్ వచ్చారని తెలిపారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీ వీడియో గురించి ప్రస్తావించిన ఆతిశీ మాలీవాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కన్పిస్తోందని అన్నారు. ఈ వీడియో స్పష్టంగా ఉందని, స్వాతి మాలీవాల్ పేర్కొన్న ఎఫ్ఐఆర్ అంతా అబద్ధమని చెప్పారు.
మాటల యుద్ధం
కేజ్రీవాల్‌కు పెరుగుతున్న జనాదరణతో స్వాతి మాలీవాల్‌తో కలిసి బీజేపీ ఈ కుట్ర చేసిందని ఆప్ ఆరోపించింది. ఇలాంటి చర్యలకు పాల్పడడం కమలం పార్టీకి అలవాటేనని మండిపడింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఆప్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేజ్రీవాల్ నిందితుడు బిభవ్ కుమార్‌ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.
కదులుతున్న బస్సులో సడెన్‌గా మంటలు- 9మంది సజీవ దహనం- మరో 24మందికి గాయాలు - Bus Fire Accident