SC On MP And MLA Criminal Cases : దేశంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 2వేలకుపైగా క్రిమినల్ కేసులను 2023లో పరిష్కరించామని ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణను త్వరితగతిన పరిష్కరించేందుకు మరిన్ని ఆదేశాలు అవసరమని విజయ్ హన్సారియా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హైకోర్టులు, ప్రత్యేక కోర్టులు 2023 సంవత్సరంలో ప్రజాప్రతినిధులపై నమోదైన 2000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించాయని, కానీ ఇంకా పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్సారియా కోర్టు దృష్టికి తెచ్చారు.
ఎంపీ, ఎమ్మెల్యేలపై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో హైకోర్టు నివేదికను కోరడం చాలా అవసరమని అన్సారియా అన్నారు. విచారణ ప్రభావితం కాకుండా ఆర్డర్ షీట్ కాపీని మాత్రమే పంపాలని సుప్రీంకోర్టు కోరితే ఒక ఏడాదిలోగా విచారణ పూర్తవుతుందని అన్సారియా తెలిపారు. చట్టసభ సభ్యులపై కేసుల విచారణ పురోగతిని ఎప్పటికప్పడు అప్‌లోడ్ చేయడానికి నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నమూనాలో మోడల్ వెబ్‌సైట్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టును అన్సారియా అభ్యర్థించారు. దీని కోసం సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి, ఈ-కమిటీ సభ్యుడు, నామినీ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సభ్యులు ఉండాలని అన్సారియా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
గతేడాది నవంబర్ 9న చట్టసభ సభ్యులపై 5,000కు పైగా క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులను ఆదేశించింది. అరుదైన కారణాలతో తప్పితే వీటి విచారణలను వాయిదా వేయవద్దని ప్రత్యేక కోర్టులకు చెప్పింది.
ఏడీఆర్ రిపోర్ట్ ఇలా
మరోవైపు లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ అసోసియేషన్ పర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అభ్యర్థుల కేసుల వివరాలను తాజాగా బహిర్గతం చేసింది. తొలి దశలో బరిలో నిలిచిన 1618 మందిలో 256 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అంటే మొత్తం పోటీ చేసిన వారిలో 16 శాతంమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ఆరుగురిపై మర్డర్ కేసులు ఉన్నట్లు బహిర్గతం చేసింది.
తొలి దశలో ఆర్జేడీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి. డీఎంకే ప్రకటించిన 22 మంది అభ్యర్థుల్లో 13మందిపై, సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన 7మంది అభ్యర్థుల్లో ముగ్గురిపై, తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అయిదుగురు అభ్యర్థుల్లో ముగ్గురిపై, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల్లో 28మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 13మందిపై, కాంగ్రెస్ ప్రకటించిన 56 మంది అభ్యర్థుల్లో 19మందిపై, బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిన 86 మంది అభ్యర్థులలో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1,618 మంది అభ్యర్థుల్లో ఏడుగురిపై హత్య కేసులు నమోదయ్యాయి. 19 మందిపై హత్యాయత్నం, 18 మందిపై మహిళలకు సంబంధించిన తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.
ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టొచ్చు? అసలేంటీ వ్యయ పరిమితి? - Lok Sabha elections 2024