Arvind Kejriwal Supreme Court : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ అంశంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని గురువారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో ఇచ్చామని చెప్పింది. తాము ఇచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదనలను వినేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆప్‌నకు ఓటేస్తే, తాను మళ్లీ తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దీనిపై స్పందించిన కోర్టు, ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని చెప్పింది.
'ఆ మంత్రిపై అపిఢవిట్ వేస్తాం'
మరోవైపు కేజ్రీవాల్ తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, దీనిపై తాము అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ ఆ కోణంలో వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. దీంతో పాటు కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రిపైనా అఫిడవిట్ దాఖలు చేస్తానని సింఘ్వీ కోర్టుకు చెప్పారు.
సుప్రీం తీర్పుపై షా కీలక వ్యాఖ్యలు
అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందని అభిప్రాయపడ్డారు. బెయిల్ మంజూరు ఉత్తర్వులపైనా మాట్లాడుతూ ఇది సాధారణ తీర్పులా లేదని అన్నారు. ఇది తనొక్కడి ఉద్దేశం మాత్రమే కాదని, చాలా మంది తనలానే భావిస్తున్నారని చెప్పారు. "చట్టంపై వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కానీ ఇది సాధారణ తీర్పు కాదని నమ్ముతున్నాను. దేశంలో చాలా మంది ప్రజలు కూడా కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందనే నమ్ముతున్నారు" అని షా తెలిపారు. మద్యం కుంభకోణంలో మార్చి 21న అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.