Supreme Court On Politicians : రాజకీయ నాయకులు తమపై వచ్చే అన్ని విమర్శలకు అతిగా స్పందించరాదని, కొన్నింటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు కూడా తమపై వచ్చే ఆరోపణలు, విమర్శల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో వాటన్నింటినీ పట్టించుకోరాదని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి విషయాలకు స్పందిస్తూ పోతే మన పని మనం చేసుకోలేమని తెలిపింది.
ప్రస్తుత రోజుల్లో ఇంటర్వ్యూల్లో విమర్శలు చేయడం సాధారణ వ్యవహారంగా మారిందని సుప్రీం కోర్టు చెప్పింది. అసోం ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసిందని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ బంగాల్‌కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత గర్గా ఛటర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 సెప్టెంబరు 9న సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు పిటిషనర్ సమాధానంగా తెలిపారు. కేసులో తుది వాదనల కోసం విచారణ వాయిదా పడింది.
జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై సుప్రీం
కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ పునర్‌సమీక్ష ఉత్తర్వులు జారీ చేసిందంటే వాటిని అటక ఎక్కించాలని అర్థం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షలను తొలగించాలన్న అభ్యర్థనలను పరిశీలించాలనేది ఆ ఉత్తర్వుల ఉద్దేశమని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ ఆదేశాలను వెల్లడించేలా అధికారులకు సూచించాలని, అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్‌ను ధర్మాసనం ఆదేశించింది. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం నుంచి దీనికి సంబంధించిన సూచనలను రెండు వారాల్లోగా తీసుకుని తదుపరి విచారణ సమయంలో ధర్మాసనానికి వివరించాలని పేర్కొంది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ జారీ చేసిన పునస్సమీక్ష ఆదేశాలను బహిర్గతం చేయాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను విధిస్తూ జారీ చేసిన అసలు ఉత్తర్వులు, వాటిని పునస్సమీక్షించాలన్న ప్రత్యేక కమిటీ ఆదేశాలను కూడా బహిర్గతం చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
షాహీ ఈద్గా మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు స్టే- వారికి నోటీసులు
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు - ఇక చోటు చేసుకోబోయే మార్పులు ఏంటి?