Sumalatha Ambareesh Joins BJP : గత ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సుమలత అంబరీశ్ అడుగులు ఎటు వైపు? ఆమె ఏ పార్టీలో చేరుతారు? అనే దానిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తాను బీజేపీలో చేరతానని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు సుమలత బుధవారం ప్రకటించారు. తన సిట్టింగ్ లోక్‌సభ స్థానం మండ్యలో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామికి మద్దతిస్తానని వెల్లడించారు. బుధవారం మండ్యలోని కాళికాంబ ఆలయంలో జరిగిన తన మద్దతుదారుల సమావేశంలో సుమలత అంబరీశ్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకున్నా మండ్య ప్రజలను తాను వదిలిపెట్టనని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
మరో మూడు స్థానాల్లో పోటీ చేయమంటే నో చెప్పాను
బీజేపీ- జేడీఎస్ కూటమి తరఫున చిక్కబళ్లాపుర్, బెంగళూరు నార్త్, మైసూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తనను కోరారని, అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సుమలత చెప్పారు. మండ్యకు దూరంగా ఉండటం ఇష్టంలేకే వాటిని వద్దనుకున్నట్లు తెలిపారు. ''మండ్య నా స్వస్థలం. ఇక్కడి ప్రజల ప్రేమను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. రాబోయే రోజుల్లోనూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను'' అని సుమలత అన్నారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అగ్రనేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ సుమలత తనయుడు అభిషేక్ అంబరీశ్, నటుడు దర్శన్ పాల్గొన్నారు.
ఇండిపెండెంట్గా మాజీ ప్రధానిపై గెలుపు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమలత బీజేపీలో చేరుతారని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ పార్టీలో చేరకుండానే తన మద్దతును ప్రకటించారు సుమలత. తాజాగా లోక్‌సభ ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, 2019లో మండ్యలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామిపై పోటీ చేసి సుమలత గెలిచారు. స్వతంత్రంగానే బరిలోకి దిగి తిరుగులేని విజయం సాధించి సత్తా చాటారు.
బీజేపీ 'మిషన్ సౌత్'- 83 సీట్లపై గురి- దక్షిణాదిలో మోదీ వ్యూహమిదే! - bjp mission south