Sudarshan Setu Dwarka Modi : దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో నిర్మితమైన ఈ 2.3 కిలోమీటర్ల పొడవు ఉన్న బ్రిడ్జ్‌కు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడి బెట్ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాధీశ్ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు. తీగల వెంతెన ప్రారంభోత్సవానికి ముందు బేట్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ద్వారకాధీస్ ఆలయంలో కూడా పూజలు చేశారు.
ఆదివారం మధ్యాహ్నం గుజరాత్ (రాజ్‌కోట్), ఆంధ్రప్రదేశ్ (మంగళగిరి), పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లు వెచ్చించింది.
డ్రగ్స్ నుంచి యువతను రక్షించాలి : మోదీ
మరోవైపు, ఓ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వ్యసనం నుంచి యువతను రక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వల్ల కలిగే చెడును ఎదుర్కొనేందుకు బలమైన కుటుంబ వ్యవస్థ అవసరమని అన్నారు. ఒక వ్యవస్థగా కుటుంబం బలహీనపడినపుడు, దాని విలువలు క్షీణించినప్పుడు అది సర్వత్రా ప్రభావం చూపుతుందని చెప్పారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులు కలుసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అందువల్ల దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి కుటుంబాలు దృఢంగా ఉండాలని ప్రధాని చెప్పారు. ఈ మేరకు 'గాయత్రీ పరివార్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'అశ్వమేధ యాగ' అనే కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు.
'రైతుల నిరసనలపై మోదీ స్పందించాల్సిందే- డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆపేదేలే!'
కొత్త క్రిమినల్ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయి? కేవలం కొత్త వాటికేనా?