South West Monsoon 2024 : నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ- ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అసోం, బంగాల్, సిక్కింలోకి ప్రవేశించాయని తెలిపింది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.
రేమాల్ తుపాను వల్లే!
అయితే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఈశాన్య భారతంలోకి కూడా పలు ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అసోం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రేమాల్ తుపాను ఏర్పడింది.
రేమాల్ తుపాను రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. 2017లో కూడా ఇలాంటి అరుదైన సంఘటనే జరిగింది. అప్పుడు కూడా రుతుపవనాల ఆగమనానికి కొద్ది రోజుల ముందు బంగాళాఖాతంలో మోరా తుపాను ఏర్పడింది. దీంతో ఒకే సమయంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి.
150 ఏళ్లుగా!
ఐఎండీ లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి. ఈసారి మే 31న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ అంచనాల కన్నా ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం విశేషం.
కేరళలో జోరుగా వర్షాలు
మరోవైపు, రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్! - monsoon forecast 2024 india