Sonia Gandhi Rajya Sabha Nomination : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియాతోపాటు మొత్తం మూడు స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో రాజస్థాన్ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్,అభిషేక్ మను సింఘ్వీ, చంద్రకాంత్ హండేరే పేర్లను ప్రకటించింది.
1998 నుంచి 2022 వరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పటికే ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా చేసిన ఆమె రాజ్యసభకు పోటీ చేసేందుకు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే గాంధీ కుటుంబం నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. ఇక దేశంలో 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని 2019లోనే ప్రకటించారు. మరోవైపు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ లేదా ఆమేఠీ నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయటం సంతోషంగా ఉందంటూ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గహ్లోత్ తెలిపారు. 'సోనియా గాంధీ ఏ రాష్ట్రానికైనా వెళ్లి రాజ్యసభకు పోటీ చేయవచ్చు. కానీ ఆమె రాజస్థాన్‌ను ఎంపిక చేసుకున్నారంటే అది రాష్ట్రానికే సంతోషకరమైన విషయం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉంటుంది' అని ఎక్స్ వేదికగా స్పందించారు.
'కాంగ్రెస్‌కు కాలం చెల్లింది- రిజర్వేషన్లకు ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే!'