Delhi Schools Receive Bomb Threats : దిల్లీలో పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ సహా ఆరు పాఠశాలకు శుక్రవారం తెల్లవారుజామున బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యాలు వెంటనే దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చాయి. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళాలతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆయా పాఠశాలలు ఈరోజు సెలవు ప్రకటించాయి. అయితే బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు దృష్టి సారించారు.
బెదిరింపులు వచ్చిన స్కూల్స్ ఇవే
పశ్చిమ్ విహార్‌లోని భట్నాగర్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఉదయం 4:21 గంటలకు), శ్రీ నివాస్పురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్ (ఉదయం 6:23 గంటలకు), అమర్ కాలనీలోని డిపిఎస్ (ఉదయం 6:35 గంటలకు), డిఫెన్స్ కాలనీలోని సౌత్ దిల్లీ పబ్లిక్ స్కూల్ (ఉదయం 7:57 గంటలకు), సఫ్దర్‌జంగ్‌లోని దిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్ (ఉదయం 8:02 గంటలకు), రోహిణిలోని వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్ (ఉదయం 8:30 గంటలకు) నుంచి మాకు కాల్స్ వచ్చాయని దిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు తెలిపారు.
బాంబు బెదిరింపు ఈమెయిల్‌పై కేంబ్రిడ్జ్ స్కూల్ శ్రీనివాసపురి ప్రిన్సిపాల్ మాధవి గోస్వామి స్పందించారు. " నేను ఈరోజు ఉదయం 5.50 గంటలకు ఈమెయిల్ చెక్ చేశా. అనంతరం పోలీసులు సమాచారం అందించా. పోలీసుల వెంటనే వారి వాహనాలను పంపించారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకురావొద్దని మేము బస్సు డ్రైవర్లకు చెప్పాము. ఈరోజు తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపాము. ఈమెయిల్లో 13, 14వ తేదీల్లో దాడులు జరుగుతాయని బెదిరించారు. పోలీసులు పాఠశాలను తనిఖీ చేశారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. మేము పోలీసులు సూచించిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము." మాధవి తెలిపారు.
ఇదిలా ఉండగా దిల్లీలో ఇలా పాఠశాలలకు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం(డిసెంబరు 9న) కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. అయితే, అది నకిలీదని ఆ తర్వాతి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2024 ఆరంభం నుంచి దిల్లీ, ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక, అక్టోబరులో దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది.