Single Voter Polling Booth In India : సాధారణంగా పోలింగ్ బూత్ దగ్గర ఉదయం నుంచే బారులు తీరే జనాలను చూస్తుంటాం. ఆ క్యూను చూసి విసుగు చెంది వెనుతిరిగే ఓటర్లు ఉంటారు. అలాంటిది గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేది కేవలం ఒక్కరు మాత్రమే.
గిర్ సోమ్‌నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం లోపలున్న మారుమూల ప్రాంతం బనేజ్‌లో ఈ ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అక్కడున్న శివాలయం పూజారి మహంత్ హరిదాస్జీ ఈ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ఓటింగ్‌ను నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలింగ్ బృందాన్ని నియమించింది. బనేజ్ నుంచి జనావాస ప్రాంతం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఈ ప్రాంతం జునాగఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. 2007 సంవత్సరం నుంచే ప్రతి ఎన్నికలకు ఒకే ఒక్క ఓటరు కోసం బనేజ్‌లో ప్రత్యేక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తోంది. శివాలయం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. గిర్ సోమనాథ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డి.డి.జడేజా ఇటీవల బనేజ్ పోలింగ్ బూత్‌ను సందర్శించి, ఏర్పాట్లపై సమీక్షించారు.
మొత్తం 11 ప్రాంతాల్లో
గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు వేసేలా చేసేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని దట్టమైన అడవులు, చిన్నపాటి ద్వీపాలు సహా మొత్తం 11 మారుమూల ప్రాంతాల్లోనూ ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోనే ఉన్న సాప్ నెస్ బిలియా అనే మరో మారుమూల ప్రాంతంలోనూ ప్రత్యేక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో 23 మంది పురుషులు, 19 మంది మహిళా ఓటర్లు నివసిస్తున్నారు. ఇది కూడా గిర్ అడవి సమీపంలోని ప్రాంతం.