Wayanad Landslides Shashi Tharoor : ఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన వయనాడ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం పర్యటించారు. బాధితులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనవంతుగా కొంత సహాయ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా తన పర్యటనను 'మరపురానిది'గా పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వందలాది మంది మృతి మీకు మరపురాని పర్యటనను మిగిల్చిందా? అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనిపై శశి థరూర్ వివరణ ఇచ్చారు. 'మెమోరబుల్' అంటూ తాను ఉపయోగించిన పదానికి ఉన్న అర్థాన్ని వివరించారు. గుర్తుంచుకోదగిన, గుర్తుండిపోయే సంఘటనను ‘మెమోరబుల్’గా వ్యవహరిస్తామని తెలిపారు. ఆయా ఘటనలకు ఉన్న ప్రత్యేకత లేదా అవి మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చినప్పుడు ఆ పదాన్ని వాడతామని తెలిపారు. పరోక్షంగా వయనాడ్ వరదలు బాధాకరమైన జ్ఞాపకాలను మిగిల్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
శశిథరూర్ స్వయంగా తానే ఓ మినీ ట్రక్కుల్లో సహాయ సామగ్రిని నింపారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిని ఓదార్చారు. వీటన్నింటికీ సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘మెమోరబుల్’ అనే క్యాప్షన్‌ను జోడించారు.
Made an emotionally searing visit to the areas devastated by the #WayanadLandslide. Picked my way through the rubble to view the destruction in the villages of Chooralmala, Mundakkai and Puncharimattam. Ground Zero was emotionally devastating – just imagining what it must have… pic.twitter.com/AZP8SfOrGa
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024
దీనిపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'శశిథరూర్‌కు మరణాలు, మారణహోమం చిరస్మరణీయ జ్ఞాపకాలా' అని ఎద్దేవా చేశారు. మరో యూజర్ స్పందిస్తూ, 'ఓ ఉన్నతస్థాయి ఎంపీ తన మరపురాని పర్యటన కోసం వరదలతో ప్రభావితమైన వయనాడ్‌కు వెళ్లారంటూ' విమర్శించారు. మరో వ్యక్తి, 'గొప్ప పదసంపద ఉన్న వ్యక్తి వందలాది మంది మరణించిన ఘటన పట్ల మెమోరబుల్ అనే పదాన్ని ప్రయోగించడం ఇమడలేదు' అని పేర్కొన్నారు.
Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b
— Amit Malviya (@amitmalviya) August 3, 2024
కొనసాగుతున్న చర్యలు
మరోవైపు కొండచరియలు విరిగిపడిన మండక్కై, చూరల్‌మలా ప్రాంతాల్లో ఆరో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300లకు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. మట్టి, శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వయనాడ్ విలయంలో ఇప్పటి వరకు 308 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు వెలికి తీసినట్టు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులున్నట్టు తెలిపింది.
'ఆర్మీ సేవలకు బిగ్ సెల్యూట్' - వయనాడ్ చిన్నారి లేఖ వైరల్ - Wayanad Landslides