Maharashtra Road Accident Today : మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. భండారా నుంచి గోండియా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడం వల్ల జరిగిందీ విషాదం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బైక్‌ను తప్పించే ఈ క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి బయల్దేరిన బస్సు కోహ్‌మారా హైవేపై వెళ్తుండగా ఉన్నట్టుండి ఓ ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చింది. దాని తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును ఇంకోవైపునకు తిప్పడం వల్ల బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
బస్సు ప్రమాద ఘటనపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోండియా జిల్లాలోని సడక్ అర్జుని సమీపంలో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని, సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.