Bandra Railway Station Stampede : ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పైకి భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడం వల్ల ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలో బాబా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఏడుగురు పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.
ప్రయాణికులతో కిటకిట
దీపావళి, ఉత్తరాదిలో ఛత్ పూజ ఉండడం వల్ల సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో బాంద్రా రైల్వేస్టేషన్ కిక్కిరిపోయింది. బాంద్రా నుంచి గోరఖ్‌పుర్‌కు వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పైకి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నించారు. రైలు కోసం క్యూలో నిల్చున్న ప్రయాణీకులు, ఒక్కసారిగా కోచ్‌ల వైపు దూసుకెళ్లడం వల్ల కొందరు ప్లాట్ ఫామ్‌పై పడిపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 9మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 5.10 గంటలకు రావాల్సిన బాంద్రా- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ వేకువజామున 2.55గంటలకే ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
#WATCH | Maharashtra | Visulas from Bandra Terminus where 9 people have been injured in a stampede due to a rush on platform number 1 of the Terminus Injured passengers have been shifted to a hospital: BMC pic.twitter.com/PccL3kjhp2
— ANI (@ANI) October 27, 2024
క్షతగాత్రులను గుర్తించిన అధికారులు
బాంద్రా రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఆదివారం వేకువజామున 2గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని షబీర్ అబ్దుల్ రెహమాన్ (40), పరమేశ్వర సుఖదర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలకం కాంగే (27), దివ్యాన్షు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్ షరీఫ్, షేక్ (25) , ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా గుర్తించారు.
కేంద్రంపై సంజయ్ రౌత్ విమర్శలు
కాగా, బాంద్రా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరి, రైల్వే మంత్రి బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు 25కిపైగా పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయని విమర్శించారు. ఈ దుర్ఘటనల్లో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోదీ ఏమో బుల్లెట్ రైళ్లు, మెట్రో, హైస్పీడ్ రైళ్ల గురించి మాట్లాడతారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బస్సులను గాలిలో నడపడం గురించి మాట్లాడతారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవం వేరు. రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి. దీనికి రైల్వే మంత్రి బాధ్యుడు కాదా?" అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
#WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, " since modi govt has come into power for the third term and the railway minister has been given the responsibility again, more than 25 major railway accidents have occurred in the country claiming more than 100 lives... you talk… https://t.co/COiURJDB46 pic.twitter.com/B2SQBXn07U
— ANI (@ANI) October 27, 2024