SC On Prabir Purkayastha Arrest : న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రబీర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా, తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. న్యూస్ క్లిక్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద గత ఏడాది అక్టోబర్‌లో ప్రబీర్ పురకాయస్థను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు సరైన ఆధారాలు చూపించడంలో విఫలం కావడం వల్ల ప్రబీర్ పురకాయస్థను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. ఆ రిమాండ్ కాపీ తమకు అందకపోవడం వల్లే ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ష్యూరిటీ, బెయిల్ బాండ్‌ను సమర్పించిన తర్వాత పురకాయస్థను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ కేసులో సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని, రిమాండ్ కాపీ అరెస్టు ఆధారాలు అందించలేదని పోలీసుల తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రిమాండ్ కాపీని పురకాయస్థకు అందించలేదని, ఇది అప్పీలుదారు హక్కులను హరిస్తుందని అభిప్రాయపడింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. తనను అరెస్ట్ చేసి, రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రబీర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో దిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు వినిపించారు. అరెస్టుకు సంబంధించిన పోలీసు అధికారాలను ఉపయోగించకుండా నిరోధించరాదని ఆయన వాదించారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
అసలేం జరిగిందంటే?
చైనా అనుకూల ప్రచారారానికి న్యూస్‌క్లిక్‌కు నిధులు అందుతున్నాయని గతేడాది 'న్యూయార్క్ టైమ్స్'లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. 2023 అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్ పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పురకాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేశారు.
కాపర్ మైన్‌లో చిక్కుకున్న కార్మికులు- 14 మంది సేఫ్, ఒకరు మృతి - Rajasthan Lift Collapse News