SC On Chandigarh Mayor Polls : చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదన్న సర్వోన్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆప్ కౌన్సిలర్ కుల్దీప్‌కుమార్‌ను మేయర్‌గా ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రద్దు చేసిన ఓట్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ ఓట్లన్నీ ఆప్ అభ్యర్థికి అనుకూలంగానే ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆప్ అభ్యర్థిని మేయర్‌గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందన్న సుప్రీంకోర్టు, రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌పై విచారణకు ఆదేశించింది. ఎనిమిది ఓట్లను తారుమారు చేయడానికి ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని స్పష్టమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అంతకుముందు పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నియమించిన జ్యుడీషియల్ అధికారి చండీగఢ్ మేయర్ ఎన్నికలో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు, వాటి లెక్కింపు సమయంలో తీసిన మొత్తం వీడియో రికార్డింగ్‌ను ధర్మాసనానికి సమర్పించారు. ఆ బ్యాలెట్ పేపర్లు, వీడియో రికార్డింగ్‌ను ధర్మాసనం పరిశీలించింది.
సుప్రీం తీర్పుపై కేజ్రీవాల్ స్పందన
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ తీర్పు ఇచ్చినందుకు అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు చెప్పారు.
చండీగఢ్‌లో మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతగానో దోహదపడుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. చండీగఢ్ మేయర్‌గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్‌కుమార్‌ను సుప్రీంకోర్టు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు చండీగఢ్ కాంగ్రెస్ చీఫ్ హర్మోహిందర్ సింగ్ లక్కీ. 'సుప్రీంకోర్టు, సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి ధన్యవాదాలు. దేశంలో న్యాయం ఇంకా సజీవంగా ఉందని ఈ తీర్పుతో వారు నిరూపించారు. ఈ రోజు చండీగఢ్‌కు చరిత్రాత్మకమైన రోజు.' అని తెలిపారు.
సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్‌గా తనను నియమించడంపై ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇండియా కూటమి, చండీగఢ్ ప్రజలకు దక్కిన విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించగలమని ఈ తీర్పు నిరూపించిందన్నారు. మరోవైపు, 'సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడింది. అదంతా కెమెరాలో రికార్డైంది. ఇది దేశానికి ఆందోళన కలిగించే విషయం. ' అని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చిందని న్యాయవాది గుర్మీందర్ సింగ్ తెలిపారు. 'ఎన్నికల కౌంటింగ్ అప్పుడు 8ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈ క్రమంలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. చట్టాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారు.' అని అన్నారు.