SC On Kolkata Doctor Case : కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో బంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు భద్రత కల్పించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సందర్భంగా బంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తన ఛాంబర్‌లో మహిళ న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని, వారిపై యాసిడ్ పోస్తామని, అత్యాచారం చేస్తామంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వికృత పోస్టులు పెడుతున్నారని సిబల్ చెప్పారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ధర్మాసనం, మహిళా న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. హత్యాచారం కేసులో ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయాలన్న సిబల్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు పేర్కొంది. దర్యాప్తు పురోగతిపై సీబీఐ ఓ నివేదిక సమర్పించగా, అందులోని విషయాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడొచ్చన్న సుప్రీంకోర్టు, వాస్తవాలను వెలికితీయడమే లక్ష్యమని తెలిపింది. అలాగే, ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నైట్ షిఫ్ట్‌ల నోటిఫికేషన్‌పై అభ్యంతరం
మరోవైపు, హత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ లేకుండా చూసుకోవాలంటూ బంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించుకోవాలని ఆదేశించింది. మహిళా వైద్యుల పనిగంటలు ఒకేసారి 12 గంటలకు మించకూడదని పేర్కొంది. "మహిళా వైద్యులకు భద్రత కల్పించడం మీ బాధ్యత. మహిళలు (వైద్యులు) రాత్రిపూట పని చేయలేరు అని మీరు చెప్పలేరు. విమాన పైలట్లు, ఆర్మీలో మహిళలు రాత్రి కూడా పనిచేస్తారు. వైద్యులందరికీ డ్యూటీ గంటలు సహేతుకంగా ఉండాలి" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ విషయంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ధర్మాసనానికి బంగాల్ సర్కార్ తెలిపింది.
ఆస్పత్రుల్లో భద్రతపై ప్రశ్నించిన సుప్రీం
ఆస్పత్రులో వైద్యులు, ఇతర ఉద్యోగుల రక్షణ కోసం కాంట్రాక్టు సిబ్బందిని నియమించాలన్న బంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వైద్యులకు భద్రత కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగాల్ సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రత కోసం పోలీసులను ఉంచాలని ఆదేశించింది.
'ఆ వివరాలు సీల్డ్ కవర్లో ఇస్తాం'
మరోవైపు, నేరం జరిగిన ప్రదేశంలో ఉన్న వ్యక్తుల గురించి జూనియర్ డాక్టర్లకు తెలుసని వారి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ సమాచారాన్ని సీల్డ్ కవర్లో సీబీఐతో పంచుకుంటామని చెప్పారు. అలాగే నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆమె కోరారు. ఈ క్రమంలో నిరసనలు తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోమని బంగాల్ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అలాగే, కోల్‌కతా హత్యాచార బాధితురాలి పేరు, ఫొటోను వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
మమత రాజీనామాకు ఆదేశించాలని పిల్
వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు ఆదేశించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. అన్ని డిమాండ్లను వినేందుకు ఇది రాజకీయ వేదిక కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి తమకు ఎటువంటి హక్కు లేదని పేర్కొంది.
కోల్‌కతాకు కొత్త సీపీ
డాక్టర్‌పై హత్యాచారం కేసులో వైద్యుల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా వినీత్ గోయల్‌ను తొలగించి ఆ స్థానంలో మనోజ్ కుమార్ వర్మను నియమిస్తూ మమతా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వినీత్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పోలీసులతో కలిసి ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని సీబీఐ ఇటీవల తెలిపింది. వినీత్ గోయల్ సీఎం మమతా బెనర్జీకి నమ్మకస్థుడనే ఆరోపణలూ ఉన్నాయి. సోమవారం మమతతో జరిగిన సమావేశంలో డాక్టర్లు, సీఎం ముందు ఐదు డిమాండ్లు ఉంచగా కోల్‌కతా పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ , హెల్ సర్వీస్ డైరెక్టర్‌ను తొలగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.