Samudrayaan Mission India : సముద్ర గర్భంలో ఉన్న వనరులను అన్వేషించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పరిశోధనలు చేపట్టింది. మనుషులను సముద్ర గర్భంలోకి పంపే సముద్రయాన్ ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చేపడుతున్న సముద్రయాన్ ప్రాజెక్ట్ గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం మీకోసం.
సముద్రగర్భంలో ఉన్న వనరుల అన్వేషణ అవసరం ఏంటి?
సముద్రగర్భం కూడా భూమిపై ఉన్న వనరుల లాగే సమృద్ధిగా ఉంటుంది. ఈ వనరులను అన్వేషించడమే సముద్రయాన్ ప్రాజెక్ట్ ప్రథమ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ద్వారా నికెల్, మాంగనీస్, కోబాల్ట్ వంటి లోహాలు భారత్ సముద్ర భూభాగంలో కనుక్కొవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అని పిలిచే వనరులతో సమృద్ధిగా ఉంది. అలాగే బంగాళాఖాతంలో గ్యాస్ హైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. సముద్రయాన్ ద్వారా వీటిని అన్వేషించవచ్చు. మాంగనీస్ వంటి ఖనిజాలు లోతైన సముద్రాలలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ఖనిజాల్ని మానవ రహిత జలాంతర్గామిలో చూడలేం. కానీ మానవులు సముద్ర గర్భ అన్వేషణలో భాగం కావడం వల్ల ఏయే ప్రదేశాలలో ఏ ఖనిజాలు దొరుకుతాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సముద్రంలో ఉన్న కొత్త జాతులను కనుక్కొవచ్చు.
ఏ పరికరం సముద్ర పరిశోధన చేయబోతోంది?
చెన్నైకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఓషియన్ టెక్నాలజీ (NIOT), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్త సంస్థ, సముద్ర గర్భంలో ఉన్న వనరుల పరిశోధన కోసం 'MATSYA 6000' అనే జలాంతర్గామిని అభివృద్ధి చేసింది. ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్‌ను రూ.4,800 కోట్లతో చేపడుతున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఓషియన్ టెక్నాలజీ ( NIOT) డైరెక్టర్ జీఏ రామదాస్ తెలిపారు. మరికొద్ది వారాల్లో చెన్నై హార్బర్లో సముద్రయాన్ ప్రాజెక్ట్ ట్రయల్ జరగనుందని పేర్కొన్నారు.
"సముద్రంలో 6000 మీటర్ల లోతులో పరిశోధనలు చేయడమే సముద్రయాన్ ప్రాజెక్ట్ లక్ష్యం. 'మత్స్య 6000' జలాంతర్గామి మొదటి దశలో ట్రయల్ 500 మీటర్ల లోతులో జరుగుతుంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు మానవులు సముద్రగర్భంలోకి వెళ్లి ఖనిజ వనరులను నేరుగా చూడగలరు. మనుషులు ప్రయాణించేందుకు వీలుగా ఈ వాహనం గోళాకారంలో ఉంటుంది. 6.6 మీటర్ల పొడవు, 210 టన్నుల బరువున్న ఈ వాహనం నీటి అడుగున 48 గంటలపాటు నిరంతరం పరిశోధనలు చేయగలదు. గోళాకారంలో మనుషులను తీసుకెళ్లగలిగే పాత్ర పూర్తిగా టైటానియంతో తయారు చేశాం. ఇతర లోహాల కంటే టైటానియం చాలా తేలికైనది. బలమైనది కూడా. అందుకే సముద్ర గర్భ పరిశోధనలో ఇది బాగా ఉపయోగపడుతుంది. జలాంతర్గామికి పైలట్‌గా మాజీ నౌకాదళ అధికారిని నియమించాం. అలాగే ఇద్దరు ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలకు పైలట్ శిక్షణ ఇస్తాం. ముగ్గురు మానవులు ప్రయాణించే మత్స్య 6000 వాహనంలో లోతైన సముద్రాన్ని వీక్షించడానికి మూడు పోర్టులు, రెండు మానిప్యులేటర్లు, ఖనిజ నమూనాలను సేకరించడానికి ఒక ట్రే ఉంటాయి. సముద్ర గర్భాన్ని, వనరులను ఫొటో తీయడానికి కెమెరా, లైట్లు వంటి ఫీచర్లు ఉంటాయి."
'మత్స్య 6000' ఎప్పుడు ప్రయోగిస్తారు?
సముద్రయాన్ ప్రాజెక్టు ప్రయోగ దశకు చేరుకుంది. ఇది విజయవంతంగా అమలైతే సముద్రయాన్ ప్రాజెక్టు తదుపరి ప్రయోగాలు ఈ ఏడాదిలోనే ఊపందుకోనున్నాయి. 2026 నాటికి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT).
'సముద్రం గర్భంలో ఉన్న వనరులను అన్వేషించడం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డీప్ సీ రీసెర్చ్ యొక్క లక్ష్యం. సముద్రంలో ఉన్న వనరులను తీయడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా అనే దానిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చడానికి ముందు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే హిందూ మహాసముద్రంలో భారత్ పరిశోధనలకు కేటాయించిన సముద్ర ప్రాంతంలోని ఖనిజ వనరులను అన్వేషించి మ్యాప్ చేశాం. సైన్యానికి అతీతంగా సైన్స్, పరిశోధన, ఖనిజాలు తదితర రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడంపైనే దేశ భద్రత ఆధారపడుతోంది. లోతైన సముద్రంలోకి మానవులను పంపిన దేశాల జాబితాలో సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో భారత్ కూడా చేరనుంది. ఈ జాబితాలో ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా ఉన్నాయి.' అని NIOT సైంటిస్ట్ ఎస్ఆర్ రమేశ్ తెలిపారు.
7ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ- 2016లో ఏం జరిగింది? OME శకలాలను ఎలా కనుగొంది? ఈటీవీ భారత్ ఎక్స్‌క్లూజివ్
బడికి వెళ్లాలంటే నది దాటాల్సిందే- 'సాయం చేయకపోతే పడవ కొంటాం!'- సీఎంకు విద్యార్థుల లేఖ