SP Leavs MVA : మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి బయటకొస్తున్నట్లు ఆ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ వెల్లడించింది. ఎంవీఏలో భాగస్వామ్య పక్షమైన శివసేన (యూబీటీ)కి ఉన్న హిందూత్వ భావజాలం కారణంగా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అజ్మీ తెలిపారు.
'బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థిస్తూ శివసేన (యూబీటీ) ప్రకటన ఇచ్చింది. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు దానిని సమర్థిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎంవీఏ కూటమికి చెందిన నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి వారికి తేడా ఏముంది? మేం ఇంకా ఎందుకు వారితో కలిసి ఉండాలి? మహా వికాస్ అఘాడీ నుంచి మేం వైదొలుగుతున్నాం. ఇదే విషయాన్ని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లాం.' అని అబు అజ్మీ పేర్కొన్నారు.
#WATCH | On Shiv Sena - UBT reportedly expressing support to those who demolished Babri Mosque in Ayodhya - in their mouthpiece 'Saamana', Maharashtra SP President Abu Azmi says, " they (shiv sena - ubt) were saying that they have become secular now - as they were in alliance… pic.twitter.com/V9pcZINNgR
— ANI (@ANI) December 7, 2024
బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశారు. 'ఈ పని చేసిన వారి పట్ల నేను గర్వంగా ఉన్నా' అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను రాసుకొచ్చారు. అటు ఓ వార్తాపత్రికలోనూ దీనిపై ప్రకటన ఇచ్చారు. ఈ పరిణామాలపై సమాజ్‌వాదీ పార్టీ (SP) ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు.
ఇదిలా ఉండగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటమి చవిచూసిన నేపథ్యంలో కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కూటమి పనితీరుపై బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా విమర్శలు చేశారు. అవకాశం వస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని ఆమె అన్నారు.