Sabarimala Online Booking : శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు షాక్! వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలకు భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారికే దర్శనానికి అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మే 4న జరిగిన దేవస్థానం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
రోజుకు 80వేల మందికి దర్శనం
రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80,000 మందిని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంతకుముందు ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని మూడు నెలల ముందు వరకు పెంచింది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.
భక్తుల రద్దీ నేపథ్యంలో
గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్‌లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.
మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు సమయంలో ఆన్‌లైన్ బుకింగ్‌ను అనుమతించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. శబరిమలలో రోజువారీ వేతనదారులుగా ఇతర రాష్ట్రాల వారు నియామకంపై బోర్డు చర్చించింది. పూజకు అరలీ పుష్పం వాడకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. గత మండల సీజన్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దర్శన సమయాన్ని గంట పెంచిన రద్దీని నియంత్రించలేకపోయారు.