Russian Army Shoes Made In Bihar : ప్రస్తుతం రష్యా నుంచి భారత్ ఆయుధాలు, యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటోంది. అయితే భారత్ కూడా రష్యా ఓ ముఖ్యమైన యుద్ధ సామగ్రిలాంటి దాన్నే ఎగుమతి చేస్తోంది. అదేంటని అనుకుంటున్నారా? బిహార్ హాజీపుర్‌లోని ఓ కంపెనీ రష్యా సైనికుల కోసం సేఫ్టీ షూలను తయారుచేస్తోంది. వాటిని రష్యా సైనికుల కోసం ఎగుమతి చేస్తోంది. హాజీపుర్‌లో తయారుచేసిన బూట్లు ప్రస్తుతం రష్యాకు ఉత్తమ ఎంపికగా మారాయి.
సైనికుల పాదాలకు రక్షణగా
హాజీపుర్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2018లో ప్రారంభమైంది. ఇందులో రష్యా సైనికుల కోసం బూట్లు తయారుచేస్తున్నారు. యుద్ధ భూమి అయినా, మంచు గడ్డలు కట్టిన నేల అయినా హాజీపుర్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన షూస్ రష్యా సైనికులకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఎముకలు కొరికే చలిలో కూడా రష్యా సైనికుల పాదాలను హాజీపుర్ బూట్లు రక్షిస్తాయి. అందుకే వీటిని రష్యా సైనికుల కోసం ఆ దేశం ఎంచుకుంది.
కంపెనీలో 70శాతం మహిళా ఉద్యోగులే
"2018లో కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించాం. స్థానికులకు ఉపాధి కల్పించడమే మా కంపెనీ ప్రధాన లక్ష్యం. హాజీపుర్‌లో మేము సైనికుల సేఫ్టీ షూలను తయారు చేస్తాం. వీటిని రష్యాకు ఎగుమతి చేస్తున్నాం. క్రమంగా యూరప్ దేశాల్లో కూడా మా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాం. త్వరలో భారత్ మార్కెట్లోకి కూడా మా షూస్‌ను దింపుతాం. రష్యన్ సైన్యం అవసరాలు తగ్గట్లు తేలికగా ఉండే స్లిప్ రెసిస్టెంట్ బూట్లను తయారు చేస్తున్నాం. ఇవి -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా సైనికుల కాళ్లకు రక్షణగా ఉండాలి. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేం సేఫ్టీ షూలను తయారుచేశాం. రష్యాకు అతిపెద్ద ఎగుమతిదారులలో మా కంపెనీ ఒకటి. ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మా కంపెనీలో పనిచేసే 300 మంది ఉద్యోగుల్లో 70శాతం మంది మహిళలే. మేము ఏడాదిగా రూ. 100 కోట్ల విలువైన 15లక్షల జతల షూలను రష్యాకు ఎగుమతి చేశాం. వచ్చే ఏడాదికి మరో 50 శాతం వ్యాపారాన్ని పెంచుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం" అని కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శివ్ కుమార్ రాయ్ తెలిపారు.
ఇటలీ, ఫ్రాన్స్,స్పెయిన్‌కు ఎగుమతి
యురోపియన్ మార్కెట్ అవసరాలకు తగిన లగ్జరీ డిజైనర్ ఫుట్ వేర్ తయారుచేస్తున్నామని కంపెనీ ఫ్యాషన్ విభాగం హెడ్ మజ్హార్ పల్లూమియా తెలిపారు. వాటిని ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బెల్జియం కంపెనీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశానికి కూడా ఎగుమతి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఈ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తున్నామో తెలుసుకోవాలని కొన్ని కంపెనీలు రాబోయే నెలల్లో బిహార్‌కు రానున్నాయని వెల్లడించారు. నిజానికి బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రంలో ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ అన్నది పెద్ద సవాలు అని, అయితే సంస్థ వ్యవస్థాపకుల దూరదృష్టి, ప్రభుత్వ తోడ్పాటుతో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
సైనిక వాహనంపై ఉగ్రదాడి వారి పనే- ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి! - Kathua Terror Attack