Renuka Swamy murder case : రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. రేణుకాస్వామి హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ మరో నిందితుడికి రూ.30 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. దర్శన్ ఈ నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రేణుకాస్వామి హత్య వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని మరో నిందితుడిని తాను కోరినట్లు దర్శన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని తెలిపారు.
నిందితులకు డీఎన్ఏ టెస్ట్
ఈ కేసులో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా దర్శన్‌తో సహా 9మందికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు నిందితులను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి బుధవారం తీసుకెళ్లారు.
'నాపై ఎలాంటి ఒత్తిడి లేదు'
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రక్షించేందుకు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ వచ్చిన వార్తలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. 'దర్శన్‌ను కాపాడేందుకు సాయం చేయాలని నాపై ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లు. దర్శన్ విషయంలో నాకు ఏ మంత్రి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదు. ఎవరైనా చేసినా వాటిని స్వీకరించను. పోలీసులకు కూడా చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఈ కేసులో విచారణ కోసం ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. ఆ విషయం గురించి నా దగ్గర సమాచారం లేదు' అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ఇదీ కేసు
తన అభిమాన నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం కలకలం సృష్టించింది. ఈ కేసులో దర్శన్ సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. హత్యకు ముందు అతడిని చిత్ర హింసలకు గురి చేయడం, కరెంట్ షాక్ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని మాయం చేసేందుకు వారు పన్నిన కుట్రకు సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కల్తీ మద్యం తాగి 25మంది మృతి- రంగంలోకి సీఎం- అధికారులపై కఠిన చర్యలు - Hooch Tragedy Tamil Nadu