Remal Cyclone Impact : బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, బంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుపాను ధాటికి బంగ్లాదేశ్, బంగాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తుండడం వల్ల పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు లక్ష మందిని తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉడండం వల్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు.
సహాయక చర్యలను ప్రారంభించిన ఎస్డీఆర్ఎఫ్
ఇక ఈ తుపాను కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి కోల్‌కతా విమానాశ్రయంలో విమాన సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. మరోవైపు తుపాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అలాగే బంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సహాయక చర్యల కోసం బంగాల్లో 12 రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం తుపాను ధాటికి నేలకొరిగిన చెట్లను తొలగించడం, విద్యుతును పునరుద్ధరించడం వంటి పనుల్లో ఈ విపత్తు నిర్వహణ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. అయితే భారీ వర్షాలు కారణంగా ఈ పనులకు కొంత ఆటంకం కలిగిస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఆహారం, తాగునీరు వంటి అందించడం ప్రారంభించిందని చెప్పారు.ప్రజలు ఇళ్లలోనే ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
బలహీనపడుతున్న రెమాల్
రెమాల్ సోమవారం ఉదయం 5:30గంటలకు తుపాను బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ క్రమంలో బంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.