Rameswaram Cafe Blast NIA : కర్ణాటక బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ-NIAకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేఫ్ పేలుడు కేసులో భాగంగా బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ కోసం కేఫ్ పరిసరాల్లోని దుకాణాలకు అమర్చిన సీసీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడు టోపీ, కళ్లజోడు ధరించి కర్చీఫ్‌తో ముఖాన్ని కవర్ చేసుకొన్నట్లు గుర్తించారు. అనుమానితుడు కేఫ్ సమీపంలో రూట్ నంబర్ 500-D బస్సు దిగినట్లు సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా నిర్ధరించారు. పేలుడుకు దాదాపు గంట ముందు అతడి కదలికలను పోలీసులు గుర్తించారు. శనివారమే కేఫ్‌లో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు.
-
VIDEO | Another CCTV visual of Bengaluru cafe blast suspect emerged showing him entering and leaving the cafe
— Press Trust of India (@PTI_News) March 4, 2024
At least 10 people were injured in the low intensity blast at the popular Rameshwaram Cafe in Bengaluru's Whitefield locality on Friday.
(Source: Third Party) pic.twitter.com/9jpUfxcJt1
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా నిందితుడిని పోలీసులు గుర్తించారని, అతడి వయస్సు 28 నుంచి 30 మధ్యలో ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే నిందుతుడిని అరెస్టు చేస్తామన్నారు. శివమొగ్గ, మంగళూరు పేలుళ్లకు దీనికి సంబంధం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆ రెండు ప్రాంతాలకు చెందిన పోలీసులు కూడా ఈ దర్యాప్తునకు సాయం చేస్తున్నారన్నారు. ఘటనకు సంబంధించి దాదాపు 50 వరకు దృశ్యాలను సేకరించినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలిలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307, 471, UAPAలోని 16, 18, 38, పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. ఏ రకమైన బాంబును పేలుడుకు వాడారన్న దానిపై ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది.
'ప్రశ్నకు నోటు' కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉండదు'- సుప్రీం కీలక తీర్పు
ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి- ప్రేమ విఫలం అయినందుకే!