Rameshwaram Cafe Blast NIA Reward : బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు కేసులో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి వివరాలు తెలిపిన వారికి పది లక్షల రూపాయలను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
సమాచారం ఇచ్చిన వారి డిటైల్స్ సీక్రెట్‌గా!
ఈ కేసులో నిందితుడి ఫొటోను కూడా షేర్ చేసింది ఎన్ఐఏ. సమాచారం తెలిపేందుకు 080-209510900, 8904241100కు కాల్ చేయాలని, లేకుంటే info.blr.nia@gov.in ఐడీకి మెయిల్ చేయాలని సూచించింది. ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం నిందితుడి కోసం ఎన్ఐఏ విస్తృతంగా గాలిస్తోంది.
ఒక్కసారిగా దేశమంతా కలవరపెట్టి!
మార్చి 1వ తేదీన బెంగళూరు రామేశ్వరం కెఫేలో పేలుడు యావత్ దేశాన్ని కలవరపెట్టింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. అయితే ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోగా, నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు ఇప్పటికే గుర్తించారు. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇడ్లీ తిని సంచిని అక్కడే పెట్టి!
ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలు ఉన్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు.
బీఎంటీసీ బస్సులోనే వచ్చి!
తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటును నిందితుడు ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వైట్‌ఫీల్డ్-కుందేనహళ్లి మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించి సీఎంఆర్‌టీ బస్టాప్‌లో దిగి కెఫేకు వచ్చాడని తేలింది.