Rameshwaram Cafe Blast Masterminds Arrested : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను NIA అరెస్టు చేసిందని తెలిపారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అసోం, బంగాల్‌లో తలదాచుకోగా నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది.
ఎన్‌ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, బంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్ర పోలీసు ఏజెన్సీల మధ్య సమన్వయం, సహకారంతో ఈ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. గత నెలలో షాజిబ్, తాహా చిత్రాలను విడుదల చేసిన NIA, వారి సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.
క్యాప్ పట్టించిందిలా!
ఈ ఇద్దరు నిందితులను ఓ క్యాప్ పట్టించింది. దానిని కొనడానికి వెళ్లినప్పుడు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వారిని అధికారులు గుర్తించారు. వీరు తరచూ సిమ్ కార్డులు మార్చుతూ అండర్‌గ్రౌండ్‌కు వెళ్లేదుకు యత్నించారు. కానీ ఎన్‌ఐఏ రాడార్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే ఎన్‌ఐఏ గుర్తించింది. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడని తెలిపింది.
కేసు దర్యాప్తు సాగిందిలా
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న మధ్యాహ్నం ఐఈడీ బంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలిలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307, 471, UAPAలోని 16, 18, 38, పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. మార్చిన 3న ఈ కేసును కర్ణాటక హోం శాఖ ఎన్ఐఏకు అప్పగించింది.
ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అయితే అతడు ఏ మార్గంలో కేఫ్‌లోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను విచారించారు. బాంబర్ కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ కెమెరా చిత్రాల ద్వారా తెలిసింది. దీంతో ఐదు కిలోమీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను దర్యాప్తు అధికారులు విశ్లేషించారు. టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలుపెట్టారు. వారు టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి చిక్కాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు.