Railway New App For Passengers : రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీని ద్వారా అన్రిజర్వ్డ్ రైలు టికెట్స్ బుకింగ్, రైల్వే ట్రాకింగ్ సహా, ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు ఈ యాప్ ద్వారా అనేక సర్వీస్‌లను కూడా పొందవచ్చని లోక్‌సభలో తెలియజేశారు.
వెయిట్‌లిస్ట్ టికెట్లపై క్లర్కేజ్ ఛార్జీలు
ఇకపై రైల్వే శాఖ - ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రద్దు చేసిన టికెట్లపై, వెయిట్‌లిస్ట్ టిక్కెట్ల రద్దుపై క్లర్కేజ్ ఛార్జీలు విధిస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. అలాగే అన్ని వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని రైల్వేల నిర్వహణ, కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చుల కోసం వినియోగిస్తున్నట్లు లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తెలిపారు.
రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ముజువాణి ఓటు ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని చర్చ సందర్భంగా మాట్లాడిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ సవరణ ద్వారా రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. రైల్వే సవరణ బిల్లుతో అలాంటిదేమీ జరగదన్నారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపర్చడంతోపాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు ఉందని రైల్వేశాఖ మంత్రి చెప్పారు. ఆగస్టు 9న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.