Puri Jagannath Ratna Bhandar Open : కోట్ల మంది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9.51 గంటలకు రహస్య గదిని తెరిచారు. సాయంత్రం 5.15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్‌రూమ్‌కు చేర్చారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీక్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆలయం లోపల ఓడ్రాఫ్ జవానులను, స్నేక్ హెల్ప్‌లైన్‌ను సిద్ధంగా ఉంచారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా, వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్, శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి విలేకరులకు రత్నభాండాగారం వివరాలు వెల్లడించారు.
ఎంత సంపద ఉందంటే?
"రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలున్నాయి. వాటిలో రెండు కలప, ఒకటి స్టీల్‌తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మారాలు కూడా ఉన్నాయి. వాటిలో మూడు కలపతో, ఒకటి స్టీల్‌తో చేసినవి. ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశాం. కనుక వాటిలో ఎంత సంపద ఉందో వెల్లడించలేం. అయితే స్వామి సంపద మొత్తం భద్రంగా ఉంది. ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇక రహస్య గది నుంచి సొరంగమార్గం ఉందన్న అంశాన్ని మేము పరిశీలించలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల్లో దాని గురించి ప్రస్తావన లేదు. పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఈ భాండాగారం మరమ్మతులను చేపడుతుంది. సొరంగ మార్గం గురించి, మరిన్ని రహస్య గదుల గురించి లేజర్ స్కానింగ్ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. భాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపు పూర్తయ్యాక, అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై గవర్నమెంట్‌కు సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యతను మేము నెరవేర్చాం. స్వామివారి సంపదను తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేయించాం. ఇదంతా వీడియోగ్రఫీ కూడా చేయించాం. లోపల పాములు, విష కీటకాలు లాంటివి ఏమీ లేవు" అని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వివరించారు.
సొరంగ మార్గం, రహస్య గదులపై భిన్నవాదనలు?
శ్రీక్షేత్ర రత్న భాండాగారంలో రహస్య గదులు, సొరంగ మార్గాలు ఉన్నాయనే విషయంపై ఆలయ అర్చకులు, పాలకుల నుంచి వివిధ వాదనలు విన్పిస్తున్నాయి. భాండాగారం నుంచి పురాతన రాజప్రాసాదం వరకు సొరంగ మార్గం ఉందని, దీనికి అనుసంధానంగా 5 రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలందించే జగన్నాథ స్వయిన్ మహాపాత్ర్ మీడియాకు తెలిపారు. ‘సొరంగ మార్గంలోని రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్లు మా తండ్రి నాకు చెప్పారు’ అని ఆయన వెల్లడించారు.
ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని మాట్లాడుతూ, ‘1971లో ప్రస్తుత పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్‌కు పట్టాభిషేకం జరిగాక బొడొదండోలో నూతన రాజప్రాసాదాన్ని నిర్మించారు. అంతకు ముందు బలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది. శ్రీక్షేత్రం రహస్య గది నుంచి ఆ పాత రాజమహల్‌కు సొరంగ మార్గం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయితే రహస్య గదుల సంగతిని కాలక్రమంలో అంతా మరిచిపోయారు. తగువిధంగా పరిశోధిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి’ అని అభిప్రాయపడ్డారు. దీనిపై దివ్యసింగ్ దేవ్ స్పందిస్తూ, 'ఏఎస్‌ఐ లేజర్ స్కానింగ్ చేస్తే సొరంగమార్గం ఉనికి తేలుతుందని చెప్పారు. గురువారం ఉదయం రహస్య గది తలుపులు తెరిచాక ఆయన లోపలికి వెళ్లారు. స్వామివారి ఖజానా గది, తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించి వచ్చాక విలేకరులతో మాట్లాడారు. ‘సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్య గదులు ఉన్నాయన్న సంగతి నేను కూడా విన్నాను. మరమ్మతులు చేపట్టనున్న ఏఎస్‌ఐ లేజర్ స్కానింగ్ చేస్తే, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వారీగా NEET ఫలితాలు ప్రకటించండి: సుప్రీం కోర్టు - NEET UG Paper Leak Case
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్- ముగ్గురు మృతి, 33 మందికి గాయాలు - Train Accident Today