Punjab Hooch Tragedy : పంజాబ్ సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 20కి పెరిగినట్లు సంగ్రూర్ సివిల్ సర్జన్ కిర్పాల్ సింగ్ పేర్కొన్నారు. జిల్లాలోని గుజ్రాన్, ఉపాలి, దండోలి గ్రామాల్లో 11 మంది మరణించారు. శుక్రవారం సునమ్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో 11 మంది పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రిలో, ఆరుగురు సంగ్రూర్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దిర్బా, సునమ్ తాలూకాలోని గుజ్రాన్, టిబ్బి రవిదాస్‌పురా, దండోలి ఖుర్ద్ గ్రామాల్లో ప్రాణనష్టం జరిగింది.
మరిన్ని అరెస్టులు
దీనిపై కేసు నమోదు చేసిన సంగ్రూర్ పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. ఒక మహిళ సహా నలుగురిని అరెస్టు చేసినట్లు సంగ్రూర్ ఎస్ఎస్పీ సర్తాజ్ సింగ్ చాహల్ తెలిపారు. వారిని చౌవాస్ జాఖేపాల్‌కు చెందిన ప్రదీప్ సింగ్ అలియాస్ బబ్బి, సోమ, సంజు మరియు రోగ్లా గ్రామానికి చెందిన అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్‌గా గుర్తించారు. వీరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు ప్రధాన నిందితుడు గుర్లాల్ సింగ్, అతని ముగ్గురు సహచరులు ఇప్పటికే సంగ్రూర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
నలుగురు అధికారులతో సిట్ ఏర్పాటు
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ర్యాంక్ అధికారి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రొఫెషనల్, సైంటిఫిక్ పద్ధతుల్లో వెలికితీసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) గురీందర్ సింగ్ ధిల్లాన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తుంది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (పాటియాలా రేంజ్) హర్చరణ్ భుల్లర్, సంగ్రూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సర్తాజ్ చాహల్, అదనపు కమిషనర్ (ఎక్సైజ్) నరేష్ దూబే సిట్‌లో సభ్యులుగా ఉంటారు. సిట్ అన్ని వివరాలను బయట పెడుతుందని, ఘటనతో సంబంధం ఉన్న ఓ ఒక్కరూ తప్పించుకోలేరని పోలీసులు చెబుతున్నారు.
ఎన్నికల వేళ కల్తీ మద్యం కలకలం
200 లీటర్ల ఇథనాల్, 156 మద్యం బాటిళ్లు, 130 కల్తీ మద్యం సీసాలు, లేబుల్ లేని నకిలీ మద్యం ఉన్న 80 సీసాలు, 4,500 ఖాళీ సీసాలు, బాట్లింగ్ మెషిన్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో నకిలీ మద్యం విక్రయాలు ప్రారంభించిన ముఠాను గురువారం వరకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత గ్రామాల్లో ఇంకా ఎవరికైనా ఆరోగ్యం క్షీణించి ఉన్నారేమోనని తెలుసుకోవడానికి సర్వేను కూడా నిర్వహిస్తున్నారు.సంగ్రూర్ హూచ్ దుర్ఘటనపై ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కల్లీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు.